తెలంగాణ

telangana

ETV Bharat / state

డిజిటల్​ విప్లవం: కరోనా వేళ వైద్యరంగం సాంకేతిక పుంతలు - medical field news

ప్రస్తుతం అంతర్జాల యుగంలో అన్ని సేవలూ డిజిటల్‌గా మారాల్సిందే. కొత్తగా వస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించకపోతే సమస్యలు తప్పవు. అత్యంత కీలకమైన ఆరోగ్య రంగంలో ఇది మరీ అవసరం. చికిత్స విధానాలకు సాంకేతికత జోడించి సేవలు అందిస్తే ప్రజలకు సౌకర్యంగా ఉండటంతో పాటు పలు సవాళ్లూ అధిగమించవచ్చు. అయితే ఇప్పటికే కొంత మేర వైద్య రంగంలో డిజిటల్ ప్రక్రియ మొదలైంది. కరోనా వచ్చాక ఆ వేగం రెట్టింపైంది. కరోనా కట్టడికి ఇప్పుడు ఫార్మసీ, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఉపద్రవాలు వచ్చినా పోరాడేందుకు సిద్ధంగా ఉండేలా పలు ఆవిష్కరణలు చేస్తున్నారు. చెప్పాలంటే కరోనా తరవాత వైద్య రంగం కొత్త పుంతలు తొక్కనుంది.

New milestones in the medical field in corona crisis
డిజిటల్​ విప్లవం: కరోనా వేళా.. వైద్యరంగంలో కొత్త పుంతలు

By

Published : Jul 21, 2020, 1:22 PM IST

ప్రతి రెండు వేల జనాభాకు కనీసం ఇద్దరు వైద్యులు, అయిదుగురు నర్సులు, ఏడు ఆస్పత్రి పడకలు అందుబాటులో ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ-డబ్ల్యూహెచ్​వో సూచిస్తోంది.

ఆ లెక్కన 135 కోట్ల జనాభా గల భారత్‌కు 2030 నాటికి 27 లక్షల అల్లోపతీ వైద్యులు అవసరమవుతారని ఐసీఎంఆర్‌ అధ్యయనం చెబుతోంది. గుండె, శ్వాసకోశ, క్యాన్సర్‌, రోగ నిర్ధరణ, రేడియాలజీ తదితర రంగాల్లో వైద్య నిపుణుల కొరత తీవ్రంగా ఉంది.

ఈ లోటుని భర్తీ చేసేదెలా... అన్న ప్రశ్నకు సాంకేతికత సమాధానంగా నిలుస్తోంది. వైద్యవ్యవస్థకు సాంకేతికత జోడించడం వల్ల సమస్యను అధిగమించవచ్చన్నది నిపుణుల సూచన. ఫలితంగా.. రోగనిర్ధరణ, చికిత్స విషయంలో సమయమూ కలిసి వస్తుందని చెబుతున్నారు.

రాయల్ ఫిలిప్స్‌ నివేదిక ప్రకారం..

భారత్‌ అతి త్వరలోనే డిజిటల్ ఆరోగ్య సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించనుంది. ఇప్పటికే దేశంలో 76% ఆరోగ్య రంగ నిపుణులు... డిజిటల్ హెల్త్‌ రికార్డుల వైపు మొగ్గు చూపుతున్నారు. డిస్ట్రిబ్యూటెడ్ లీడర్ టెక్నాలజీస్‌ సాంకేతికతతో బ్లాక్‌చైన్ సహకారంతో ఓ రోగికి సంబంధించిన వివరాలు సురక్షితంగా ఉంచొచ్చు.

ఇదే కాదు.. ఇప్పుడు కృత్రిమ మేధ కూడా వైద్య రంగంలోకి ప్రవేశించింది. ఈ సాంకేతికతతో అత్యుత్తమ వైద్య సేవలు పొందవచ్చు. 2021నాటికి ఈ తరహా వైద్యసేవలు 40 శాతం వృద్ధి రేటు సాధించే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

వైద్యరంగంలో డిజిటల్‌ విప్లవం

ఆస్పత్రుల నిర్వహణ, వ్యాధి నిర్ధరణ, చికిత్స, వైద్య పరికరాల వినియోగం, ఆరోగ్య బీమా, మందుల విపణులు తదితర వైద్య రంగాల్లో కృత్రిమ మేధదే పై చేయిగా ఉంది.

దేశంలో 40 శాతం జనాభాకు అంతర్జాల సేవలు అందుబాటులోకి రావడం, స్మార్ట్‌ ఫోన్ల వినియోగం పెరగడం- డిజిటల్‌ విప్లవానికి పునాదులుగా మారుతున్నాయి. వైద్య నిపుణుల కొరత, భౌగోళిక పరిస్థితులు, మౌలిక వసతుల పరిమితులు, పట్టణ పల్లె ప్రాంత ప్రజల మధ్య నెలకొన్న అసమానతలు..! ఈ సవాళ్లన్నింటనీ ఈ సాంకేతికతతో అధిగమించటం వీలవుతుంది.

అమెరికాలో కృత్రిమ మేధ వినియోగం వల్ల చికిత్సల్లో మానవ తప్పిదాలు 15 శాతం మేర తగ్గినట్లు అక్కడి అధ్యయనాలు చెబుతున్నాయి. క్రమంగా భారత్‌లోనూ ఏఐ సాంకేతికత వినియోగం పెరగనుందనటానికి... ప్రస్తుత పరిణామాలే నిదర్శనం.

కృత్రిమ మేధకు విశేషాదరణ

భారత్‌లో ఆరోగ్య రంగంలో 46% మేర కృత్రిమ మేధ వినియోగిస్తున్నట్టు ఫ్యూచర్ హెల్త్‌ ఇండెక్స్‌ ఎఫ్​హెచ్​ఐ-2019 నివేదిక వెల్లడించింది. అత్యంత కచ్చితమైన విధానాలు అనుసరిస్తూ వైద్యం అందించేలా చేయటమే ఈ సాంకేతికతలో ఉన్న ప్రత్యేకత.

స్వయంచాలక విశ్లేషణ కలిగిన వైద్య పరీక్షలు, నిర్దిష్టమైన రోగ నిర్ధరణ, రోగ తీవ్రతను నిరంతరం పర్యవేక్షించే ఉపకరణాలు వైద్య పరిరక్షణలో కీలకంగా మారుతున్నాయి. క్యాన్సర్‌, గుండె, శ్వాసకోశ వ్యాధులు విస్తరిస్తుండటం, వృద్ధుల సంఖ్యా క్రమేపీ పెరుగుతుండటం వల్ల వైద్యులు తమ పనిభారం తగ్గించుకునేందుకు కృత్రిమ మేధను ఆశ్రయిస్తున్నారు. లక్షల మంది రోగుల నుంచి సమాచారం సేకరించి, విశ్లేషించి చికిత్స మార్గాన్ని సూచిస్తుండటం వల్ల కృత్రిమ మేధకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది.

ఎక్స్‌టెండెడ్ రియాల్టీ సాంకేతికతతో వైద్య విద్యకు, పరిశోధనలకు ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఇందుకు సంబంధించిన సమాచార సేకరణలో ఈ సాంకేతికత ఎంతో కచ్చితత్వంతో పని చేయనుంది. ఇక క్వాంటమ్ కంప్యూటింగ్‌ సహకారంతో కష్టతరమైన సమాచారాన్ని కూడా సులువుగా సేకరించి...కొత్త ఔషధాలు కనుగొనేందుకు వీలుపడుతుంది. టెంపరేచర్ మానిటరింగ్ అండ్‌ సెన్సింగ్‌తో ఔషధాలు భద్రపరచటంలో అత్యంత జాగ్రత్తలు పాటించవచ్చు. సురక్షిత రవాణా కూడా సాధ్యపడుతుంది. మందుల కోసం రోగులు ఎక్కువ కాలం పాటు వేచి చూడకుండా ఈ సాంకేతికత చాలా తోడ్పడుతుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్- ఆర్​ఎఫ్​ఐడీతో ఔషధాలకు, వాక్సిన్‌లకు ట్యాగింగ్‌ చేసి వాటి నిలవలు ఎంత మేర ఉన్నాయి..? గడువు తేదీ...లాంటి కీలక సమాచారాన్ని సులువుగా పొందే వీలుంటుంది.

దేశంలో ఏటా సుమారు పది లక్షల మంది వివిధ రకాల క్యాన్సర్ల బారిన పడుతున్నట్లు అంచనా. క్యాన్సర్‌ రోగనిర్ధరణలో నిష్ణాతులైన శాస్త్రవేత్తలు అతి కొద్ది మందే ఉండటం వల్ల మెషీన్‌ లెర్నింగ్‌ సహకారంతో వైద్యాన్ని మరింత సరళతరం చేయవచ్చని నిపుణులు అంటున్నారు. డిజిటల్‌ రోగ నిర్ధరణ ద్వారా నూటికి నూరుపాళ్లు నిర్ధరణకు రావచ్చునని ముక్తకంఠంతో చెబుతున్నారు. రొమ్ము క్యాన్సర్‌ నిర్ధరణలో 11మంది నిపుణులైన శాస్త్రవేత్తలు చేసే పనిని ఒక మెషీన్‌ లెర్నింగ్‌ వినియోగంతో మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని మరో అధ్యయనంలో తేలింది. త్వరితగతిన వ్యాపించే సాంక్రమిక వ్యాధులను గుర్తించటంలో, నియంత్రణలో ఈ ప్రక్రియ అధిక ఎంతో అవసరం.

ఎమ్‌-హెల్త్‌ సాంకేతికత కూడా భారత్‌లో క్రమంగా విస్తరిస్తోంది. గూగుల్‌ ట్రెండ్స్ నుంచి సేకరించిన సమాచారం ప్రకారం...వైద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించిన అప్లికేషన్ల డౌన్‌లోడ్‌లు పెరుగుతున్నాయి. మొబైల్ హెల్త్‌, హెల్త్‌ యాప్స్‌, మెడికల్ యాప్స్‌ లాంటి పదాలు గూగుల్‌లో ఎక్కువగా వెతికిన తొలి 5 దేశాల్లో భారత్ కూడా ఉంది. నేషనల్ హెల్త్ పోర్టల్, ఈ-హాస్పిటల్, ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్‌ఫర్మేషన్ ప్రోగ్రామ్‌-ఐహెచ్​ఐపీ లాంటి కార్యక్రమాలతో ఈ-గవర్నెర్స్‌పై ప్రత్యేక దృష్టి సారించింది కేంద్రం. ఇక ఈ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులూ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే జనాభాలో 65% మందికి సరైన వైద్య సౌకర్యాలు అందటం లేదు. అల్పాదాయ వర్గాలు ఎక్కువగా నివసించే అలాంటి ప్రాంతాల్లో వైద్య సేవలు విస్తృతం చేయటం చాలా కీలకం. ఇలాంటి చోట డిజిటల్ వైద్య విధానం అమలు చేయాలన్నది కొందరి సూచన. దూరాభారాలతో సంబంధం లేకుండా ఎమ్‌-హెల్త్‌ సాంకేతికతతో సులువుగా అందరికీ చికిత్స అందించేందుకు వీలవుతుంది.

నిజానికి...ఇప్పటికే పలు దేశాలు ఇప్పటికే వైద్య విధానంలో సంస్కరణలు తీసుకొచ్చి అధునాతన పరిజ్ఞానంతో దూసుకుపోతున్నాయి. భారత్‌లో ఎప్పుడో ఈ మార్పు రావాల్సి ఉన్నా అది పలు కారణాల వల్ల ఆలస్యమైంది. కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభంతో క్రమంగా వైద్య విధానంలో మునుపెన్నడూ చూడని సంస్కరణలు వస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి:నీటిపారుదల శాఖ జలవనరుల శాఖగా మార్పు: సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details