తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్త జిల్లాలు@2

రాష్ట్రంలో ములుగు, నారాయణపేటలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి పాలనాపర సేవలు ప్రారంభంకానున్నాయి.

By

Published : Feb 17, 2019, 6:28 AM IST

Updated : Feb 17, 2019, 7:51 AM IST

కొత్త జిల్లాలు

కొత్త జిల్లాలు
శాసనసభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్​ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కొత్తగా రెండు జిల్లాలు ఏర్పాటయ్యాయి. నారాయణపేట, ములుగు జిల్లాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం తుది నోటిఫికేషన్​ విడుదల చేసింది. నేటి నుంచి 9 మండలాలతో ములుగు, 11 మండలాలతో నారాయణపేట జిల్లాలు మనుగడలోకి రానున్నాయి. వీటితో మొత్తం జిల్లాల సంఖ్య 33కు చేరుకొంది.

శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్​ ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే జయశంకర్​ భూపాలపల్లి జిల్లా నుంచి ములుగు కొత్త జిల్లాగా అవతరించింది. కొత్తగా ఏర్పడ్డ ఈ జిల్లాల్లో ఆదివారం నుంచి పాలనాపరమైన సేవలు ప్రారంభంకానున్నాయి. 9 మండలాలతో ఏర్పడిన ములుగు జిల్లా జనాభా 2.94 లక్షలు. ములుగు కేంద్రంగా పరిపాలన కొనసాగనుంది. ఈ జిల్లాకు కలెక్టర్​గా భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వి. వెంకటేశ్వర్లుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. 11 మండలాలతో ఏర్పడిన నారాయణపేట జిల్లా జనాభా 5.04 లక్షలు. నారాయణపేట కేంద్రంగా పరిపాలన కొనసాగనుంది. మహబూబ్​నగర్ జిల్లా కలెక్టర్​ రొనాల్డ్ ​రాస్ ఈ జిల్లాకు అదనపు కలెక్టర్​గా విధులు నిర్వహించనున్నారు.

కోయిల్​కొండ మండలాన్ని నారాయణపేట జిల్లాలో కలుపుతూ ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనపై స్థానికులు పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ మండలాన్ని మహబూబ్​నగర్​లోనే ఉంచుతూ... ప్రభుత్వం 11 మండలాలతో నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేసింది.
రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల తర్వాత మరో 12 కొత్త మండలాలను ఏర్పాటు చేసే అవకాశముంది. పరిపాలన సౌలభ్యం దృష్ట్యా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజనను ప్రభుత్వం కొనసాగిస్తూ వస్తోంది.

Last Updated : Feb 17, 2019, 7:51 AM IST

ABOUT THE AUTHOR

...view details