కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కొత్త యాప్ను రూపొందించింది. ట్రేసింగ్.. టెస్టింగ్.. ట్రీటింగ్ విధానంలో కరోనా బాధితుల సన్నిహితుల( కాంట్రాక్ట్స్ పర్సన్స్) చరవాణికి సందేశం పంపేలా యూప్ రూపొందించినట్లు ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు.
రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై మంత్రి ఈటల రాజేందర్ సమీక్షించారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. తగిన సలహాలు ఇస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి కిందిస్థాయి ఉద్యోగి వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు ఈటల పేర్కొన్నారు.
గతంలో కరోనా చికిత్స అందించిన అన్ని ఆస్పత్రులూ తిరిగి పూర్తి స్థాయిలో కొవిడ్ చికిత్స కేంద్రాలుగా మార్చాలని నిర్ణయించినట్లు ఈటల వెల్లడించారు. 33 జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో కరోనా వార్డులు ఏర్పాటుచేయాలని స్పష్టం చేశారు. అక్కడ 24 గంటలపాటు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి నిరంతరం పర్యవేక్షిస్తారన్నారు.
కొవిడ్ చికిత్స కేంద్రాలుగా..
హైదరాబాద్లో నేచర్ క్యూర్, ఆయుర్వేద, నిజామియా టీబీ, ఫీవర్, ఛెస్ట్ ఆస్పత్రులను పూర్తి స్థాయిలో కరోనా చికిత్స, క్వారంటైన్ కేంద్రాలుగా మార్చాలని నిర్ణయించినట్లు మంత్రి ఈటల వెల్లడించారు. వారం రోజుల్లో ఈ కేంద్రాలను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.