ఎన్నో ఏళ్ల కల.. నిజమైన వేళ యావత్ భారతావని మురిసిపోతోంది. శనివారం టోక్యో వేదికగా భారత అథ్లెట్ నీరజ్ చోప్రా పసిడి పతకంతో ఓ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు. ఆ చరిత్రకు తొలి అడుగు పడింది ఈ నవాబుల నగరంలోనే. 2015లో హైదరాబాద్ వేదికగా జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో అండర్-20 విభాగంలో పాల్గొన్న నీరజ్.. ఈటెను 76.91మీటర్ల దూరం విసిరి రికార్డు సృష్టించాడు.
ఆ తర్వాత జూనియర్స్ విభాగంలో గతేడాది ఓ క్రీడాకారుడు ఆ రికార్డును తిరగరాశాడు. సీనియర్ అథ్లెట్‌గా రాటుదేలిన నీరజ్ తనను తాను మెరుగు పర్చుకుంటూ టోక్యో ఒలింపిక్స్‌లో 87.58మీటర్ల దూరంతో ప్రపంచ వేదికపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించాడు. ఈ విజయానికి భాగ్యనగరం పండగ చేసుకుంది. ఆట జరుగుతున్నంత సేపూ నగర క్రీడాభిమానులంతా టీవీలకు అతుక్కుపోయారు. విజేతను ప్రకటించి.. జాతీయ గీతాలాపన జరిగే సమయంలో ప్రతి కన్ను చెమ్మగిల్లింది. అనేక ప్రాంతాల్లో స్వీట్లు పంచుకుని సంబంరాలు చేసుకున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు, ప్రముఖులు ట్వీట్లతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇలా ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం
ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో తొలి పతకం కోసం 100 ఏళ్లుగా నిరీక్షించిన భారత్ కల ఫలించింది. జావెలిన్ త్రో ఫైనల్లో గెలిచిన యువ సంచలనం నీరజ్ చోప్రా మువ్వన్నెల పతాకానికి పసిడి కాంతులద్దాడు. 23 ఏళ్ల ఈ కుర్రాడు ఎన్నో ఆశలు.. అంచనాలతో టోక్యోకు వెళ్లి స్వర్ణం గెలిచి భారత్ గర్వించేలా చేశాడు. జావెలిన్‌ను అత్యుత్తమంగా 87.58 మీ. దూరం విసిరాడు నీరజ్. రెండో ప్రయత్నంలోనే ఈ మార్కును అందుకున్నాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన వాద్లెచ్ జాకుబ్(86.67), వెసెలీ విటెజ్స్లావ్(85.44) వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించారు.
1900 పారిస్ ఒలింపిక్స్‌లో నార్మన్ ప్రిచర్డ్(బ్రిటీష్ ఇండియా) అథ్లెటిక్స్‌లో (200 మీ. హర్డిల్డ్, 200 మీ. స్ప్రింట్స్) భారత్‌కు రెండు రజత పతకాలు అందించాడు. 120 ఏళ్ల తర్వాత.. మళ్లీ నీరజ్ చోప్రా ఇప్పుడు బంగారు పతకం నెగ్గి చరిత్ర సృష్టించాడు.