వైరస్ కారణంగా గతంలో వాయిదాపడిన నీట్‌ను.. కరోనా నిబంధనల మధ్య జరిగింది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌లోని దాదాపు 112 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాశారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం, శానిటైజేషన్ వంటి నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నారు.
కొవిడ్ నిబంధనల నడుమ ప్రశాంతంగా ముగిసిన నీట్ - ప్రశాంతంగా ముగిసిన నీట్
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ ... దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన పరీక్ష... సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. నిబంధనలను పాటిస్తూ... రాష్ట్రవ్యాప్తంగా మెుత్తం 112 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాశారు.
ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు అనుమతించిన అధికారులు... గుంపుగా ఉండకుండా నిర్ణీత సమయాన్ని కేటాయించి లోపలికి పంపించారు. ఒక్కో గదిలో విద్యార్థుల సంఖ్యను 24 నుంచి 12కు తగ్గించి పరీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రం బయట, గదిలో శానిటైజర్‌ను అందుబాటులో ఉంచడంతో పాటు... ప్రతిఒక్కరూ మాస్క్ ధరించేలా చర్యలు తీసుకున్నారు. పలుచోట్ల పరీక్ష కేంద్రాల చిరునామా తెలియక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. వరంగల్‌లో ఓ విద్యార్థినికి తప్పుడు పరీక్షా కేంద్రం కేటాయించడంతో పరీక్ష రాయలేకపోయింది. అధికారుల నిర్లక్ష్యంపై సుబేదారీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.