Naveen Murder Case Updates: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో నిజాలను నిగ్గు తేల్చే పనిలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిహర కృష్ణను అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు రెండోరోజూ విచారించారు. పలు ప్రశ్నలను అడగగా.. ఎటువంటి భయంలేకుండా, జంకకుండా సమాధానాలు చెప్తున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణలో భాగంగా ఉదయం సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు.. హరిహరకృష్ణను సాయంత్రం మరోసారి బయటకు తీసుకెళ్లారు. సరూర్ నగర్ సీసీఎస్ కార్యాలయంలో విచారిస్తున్న హరిహరకృష్ణను ఓ వాహనంలో ఎక్కించుకొని పోలీసులు ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. నిందితుని నుంచి హత్య జరిగిన తీరును పోలీసులు అడిగి తెలుసుకున్నారు.
మలక్‌పేట్ సలీంనగర్‌లోని అపార్ట్మెంట్లోకి హరిహరకృష్ణను తీసుకెళ్లిన పోలీసులు.. కాసేపు అక్కడ ఉన్న తర్వాత తిరిగి తమ వెంట వాహనంలో తీసుకెళ్లిపోయారు. నవీన్‌ను హత్య చేసిన అనంతరం హరిహర కృష్ణ ఇంటికి వెళ్లడంతోనే.. పోలీసులు అతని ఇంటికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
కస్టడీలో భాగంగా హరిహర కృష్ణ చెప్పిన విషయాలను ఆధారంగా చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు అడిగే ప్రశ్నలకు తడబడకుండా సమాధానాలు చెప్పినట్లు సమాచారం. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు లొంగిపోయిన రోజు చెప్పిన అంశాలనే వివరిస్తున్నట్లు తెలుస్తోంది. రెండో రోజు అతడు చెప్పిన కొన్ని విషయాలు పోలీసులను సైతం ఉలికిపాటుకు గురిచేసేలా ఉన్నాయని విశ్వసనీయ సమాచారం.
హత్య జరిగిన స్థలం, హరిహర కృష్ణ నివాసం ఉండే అంబర్‌పేట్‌లోని తన నివాసానికి వెళ్లి, బ్రాహ్మణపల్లిలోని హసన్ ఇంటికి తీసుకెళ్లి పోలీసులు అన్ని వివరాలు సేకరించారు. 17వ తేదీ మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి హత్య జరిగే వరకు, ఆ తర్వాత హరిహర కృష్ణ ఎక్కడెక్కడికి వెళ్లాడో ఆ ప్రాంతాలన్నింటికీ నిందితుడిని తీసుకెళ్లారు. తొలుత నిందితుడిని మూసారాంబాగ్‌లోని అతడి సోదరి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ అక్కాబావల నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. ఘటన జరిగిన రోజు నిందితుడు నవీన్‌తో కలిసి మూసారాంబాగ్ నుంచి పెద్దఅంబర్‌పేట్ వరకు ఆదే మార్గంలో ప్రయాణించారు.