National Conference on Oil Palm Cultivation : దేశంలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. దేశీయ వంట నూనెల ఉత్పత్తి పెంచి... దిగుమతులను తగ్గించటంతోపాటు రైతుల ఆదాయం పెంచాలన్న లక్యంతో నూనె గింజల నేషనల్ మిషన్ చేపట్టామని వెల్లడించారు. హైదరాబాద్‌లో హెచ్ఐసీసీ నొవాటెల్‌లో ఏర్పాటు చేసిన బిజినెస్ సమ్మిట్‌ను కేంద్రమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయిల్ పామ్ ఉత్పత్తులు, సాగు పద్ధతుల ప్రదర్శనను ప్రారంభించారు.
తెలంగాణ అగ్రస్థానంలో..
Telangana Oil Palm Cultivation : కొవిడ్‌తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని కేంద్రమంత్రి అన్నారు. భారత్‌లో మాత్రమే వ్యవసాయ వృద్ధి ఆగలేదని... రైతుల ఆదాయం రెట్టింపు కోసం కలిసి పనిచేయాలని కోరారు. సేంద్రియ సేద్యంపై దృష్టి సారించాలన్న కేంద్రమంత్రి... దేశంలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం 3 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పామ్ సాగువుతోందని... ఆయిల్‌పామ్ సాగులో తెలంగాణ అగ్రస్థానంలో నిలవబోతుందని చెప్పారు.
'విత్తన లభ్యత, సాంకేతిక మద్దతు, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మిల్లుల ఏర్పాటు వంటి అంశాలపై ప్రధాన పెట్టుబడులను పెట్టనున్నాం. ఆయిల్ పామ్ సాగుకు సంబంధించి రాష్ట్రాలకు కేంద్రం సంపూర్ణ మద్దతు ఇస్తుంది. రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి. సేంద్రియ ఎరువుల వినియోగం పెంచే విధంగా చర్యలు వేగంగా తీసుకోవాలి. సహజ, ప్రకృతి, సేంద్రియ సాగుకు సంబంధించి తెలుగు రాష్ట్రాలు ముందుకు వెళ్తున్నాయి.'
-నరేంద్రసింగ్ తోమర్, కేంద్రమంత్రి
వంట నూనెల కోసం నేషనల్ మిషన్
వంట నూనెల విషయంలో ఆత్మనిర్భర్ చేయడం కోసం దాదాపు రూ.11 వేల కోట్లతో నేషనల్ మిషన్ చేపట్టామని వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి అన్నారు. ఇందులో దాదాపు రూ.2,200 కోట్ల వరకు రాష్ట్రాలు భరిస్తాయని తెలిపారు. ప్రభుత్వం, పరిశోధన రంగాలు, రైతులు కలసి ఈ ప్రణాళికని విజయవంతం చేయాలని సూచించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయటంలో ఈ కార్యక్రమం దోహదం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.