తెలంగాణ

telangana

By

Published : Jan 29, 2023, 10:33 PM IST

ETV Bharat / state

జగన్​ను నమ్మి అధికారమిస్తే.. మహిళల తాళిబొట్లు తాకట్టు పెట్టాడు: లోకేశ్​

Lokesh Yuvagalam Padayatra : మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి.. మహిళల తాళిబొట్లను కూడా తాకట్టు పెట్టాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధిక ధరలపై సమీక్షించి తగు నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఏపీలోని కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో మూడో రోజు యువగళం పాదయాత్ర ప్రారంభించిన లోకేశ్​ మహిళలతో ముఖాముఖి నిర్వహించారు.

Lokesh
Lokesh

Lokesh Yuvagalam Padayatra : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర మూడో రోజు ఆంధ్రప్రదేశ్​లోని కుప్పం నియోజకవర్గం శాంతిపురం మీదుగా కొనసాగింది. ఆయనకు మహిళలు తిలకం దిద్ది హారతి పట్టారు. ఆ తర్వాత స్థానిక మహిళలతో లోకేశ్‌ భేటీ కాగా.. మూడున్నరేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు వాపోయారు. అమ్మఒడి పేరుతో తమను జగన్ మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారంలోకి రాగానే ధరలపై సమీక్ష : పన్నుల భారం తగ్గిస్తేనే నిత్యావసర ధరలు తగ్గుతాయని.. దీనిపై సమీక్షించి అధికారంలోకి రాగానే తెలుగుదేశం ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​ స్పష్టం చేశారు. మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్​రెడ్డి, మహిళల తాళిబొట్లను కూడా తాకట్టు పెట్టాడని ధ్వజమెత్తారు. మద్యం సీసా తయారీ నుంచీ మద్యం తయారీ, అమ్మకం వరకు అంతా జగన్ రెడ్డి బినామీలేనని ఆరోపించారు. 45ఏళ్ల మహిళలకు పింఛన్ ఇస్తానన్న హామీ ఏమైందని లోకేశ్ నిలదీశారు. అమ్మఒడికి కోత పెట్టడంతో పాటు ఆంక్షలతో లబ్ధిదారుల్ని కుదించేశాడని మండిపడ్డారు. శాసనసభ సభ సాక్షిగా దిశా చట్టంపై అసత్యాలు పలికారని విమర్శించారు. పొదుపు సంఘాలను నిర్వీర్యం చేయటంతో స్వయం ఆర్థికాభివృద్ధి కూడా కుంటుపడిందని డ్వాక్రా మహిళలు తెలిపారు. గత ఎన్నికల్లో ఒక్క అవకాశం మాట నమ్మి చారిత్రక తప్పిదం చేశామని మహిళలు వాపోయారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కాకుంటే తమ బిడ్డలకు ఇక భవిష్యత్తు లేదనే విషయాన్ని మహిళలు గ్రహించామన్నారు. తెలుగుదేశాన్ని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు తమ వంతు కృషి చేస్తామని మహిళలు స్పష్టం చేశారు. చంద్రబాబు మహిళలకు అందించిన చేయూతపై ఓ మహిళ పాటపాడి అందరినీ అలరించింది.

మహిళల భద్రతకు హామీ : టీడీపీ అధికారం వచ్చిన తరువాత విద్యార్థి దశ నుంచే మహిళల గొప్పతనం, త్యాగాలు, కష్టాలు తెలిసే విధంగా ప్రత్యేక పాఠ్యాంశాలు ప్రవేశపెడతామని, మహిళలకు భద్రత, భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలను, సమస్యలను ఆయనకు వివరించారు. అమ్మ ఒడి ఇచ్చామంటూ పన్నులు విపరీతంగా పెంచారని మహిళలు తెలిపారు. అనేక సాకులు చెప్పి అమ్మ ఒడిలో డబ్బులు కట్ చేసి ఇస్తున్నారని... ఈ ఏడాది అమ్మ ఒడి కూడా పడలేదన్నారు.

ఏం మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు.. :మద్యపాన నిషేధం చేసిన తరువాత ఓట్లు అడగడానికి వస్తానని చెప్పిన జగన్ రెడ్డి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతాడని నారా లోకేశ్‍ దుయ్యబట్టారు. ఆఖరికి మందు బాబులను తాకట్టు పెట్టిన ఘన చరిత్ర జగన్ రెడ్డిదన్నారు. జగన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డి.. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మ ఒడి అన్నారు... ఇప్పుడు ఇస్తున్నారా..? అని ప్రశ్నించారు. అరకొరగా ఇచ్చే అమ్మ ఒడి కూడా ఏడాది ఎగొట్టారన్నారు. 45 సంవత్సరాలకే మహిళలకు పెన్షన్ అన్న జగన్‍ ఇస్తున్నారా..? అని ఆయన ప్రశ్నించారు.

జగన్​ను నమ్మి అధికారమిస్తే.. మహిళల తాళిబొట్లు తాకట్టు పెట్టాడు: లోకేశ్​

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details