తెలంగాణ

telangana

ETV Bharat / state

N Light 360: తల్లి ఒడిలో ఉంటూనే కామెర్లకు చికిత్స.. ఎలా అంటే? - n light 360 equipment for jaundice treatment of newborns

N Light 360: నవజాత శిశువులు చాలామంది కామెర్ల బారిన పడతారు. ప్రస్తుతం వారికోసం ఫొటోథెరపీ విధానం మాత్రమే అందుబాటులో ఉంది. చికిత్సలో భాగంగా శిశువులను, తల్లులను వేరుగా ఉంచాల్సి వస్తుంది. తద్వారా నవజాత శిశువులు తల్లిపాలకు దూరమవుతున్నారు. వీటికి పరిష్కారంగా ప్రసాద్‌ ముద్దం, అఖిత కలిసి... "ఎన్‌లైట్‌ 360” పరికరాన్ని రూపొందించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంటెలిజెంట్ ఫొటోథెరపీ యూనిట్‌ తయారు చేశారు. ప్రస్తుతం మార్కెట్లో ఉండే ఫొటోథెరపీ యంత్రాలకంటే మూడురెట్లు తక్కువ ధరకే దీనిని అందించేలా కసరత్తు చేస్తున్నామంటున్న వారితో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

N Light 360: తల్లి ఒడిలో ఉంటూనే కామెర్లకు చికిత్స.. ఎలా అంటే?
N Light 360: తల్లి ఒడిలో ఉంటూనే కామెర్లకు చికిత్స.. ఎలా అంటే?

By

Published : Mar 30, 2022, 12:41 PM IST

తల్లి ఒడిలో ఉంటూనే కామెర్లకు చికిత్స

N Light 360: నవజాత శిశువులు చాలా మంది కామెర్ల బారిన పడతారు. తల్లి నుంచి వేరుగా ఉంచి వీరికి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇందువల్ల తల్లిపాలకు దూరమవుతారు. తల్లి పాలిచ్చేందుకు తీసుకెళితే అంత సమయం ఫొటోథెరపీ అందుకోలేరు. గ్రామీణ ప్రాంతాల్లోనైతే యంత్రాలూ అందుబాటులో ఉండవు. వీటన్నింటికీ పరిష్కారం చూపేలా ప్రసాద్‌ ముద్దం, కె.అఖిత కలిసి ‘ఎన్‌లైట్‌ 360’ పరికరాన్ని రూపొందించారు. బ్యాటరీతో నడిచే ఈ పరికరం ద్వారా తల్లి ఒడిలోనే శిశువును ఉంచి చికిత్స అందించడం సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఇది పరీక్షల తుది దశలో ఉంది. త్వరలోనే మార్కెట్‌లోకి తెచ్చేలా ఆవిష్కర్తలు కృషి చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది తల్లులకు ఈ పరికరాన్ని ఇచ్చి దాని పనితీరును పరీక్షించారు. వైద్యుల సలహాలు, సూచనలు తీసుకున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉండే ఫొటోథెరపీ యంత్రాలకంటే మూడురెట్లు తక్కువ ధరకే దీనిని అందించేలా కసరత్తు చేస్తున్నామని వారు వివరించారు. ఐఐటీ హైదరాబాద్​కు చెందిన ప్రసాద్‌ ముద్దం, అఖిత కలిసి తల్లి ఒడిలోనే శిశువును ఉంచి కామెర్లకు చికిత్స అందించేలా ఈ అద్భుత పరికరాన్ని రూపొందించారు. 'ఎన్​లైట్​' పరికరం గురించి వారు వివరించారు.

పరికరం ఎలా పనిచేస్తుందంటే.. "ఇది ఫొటోథెరపీ పరికరం. 460 వేవ్​ లెంత్​లో వచ్చే బ్లూలైట్​ ద్వారా చిన్నారుల రక్తంలో ఉండే కామెర్లకు సంబంధించిన బైలురూబిన్​ను మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంది. ఇది సాధారణంగా జరగుతున్న పద్ధతి. మేము 'ఎన్​లైట్​ 360' అనే కొత్త పరికరాన్ని కనుగొన్నాం. మేము తయారుచేసిన పరికరంతో సాధారణ మార్కెట్​లో ఉన్న వాటికన్నా 33శాతం వేగంగా పని చేస్తుంది. హైదరాబాద్​లోని ల్యాబ్స్​లో దీనిని పరీక్షించాం. ఇది ఒక పోర్టబుల్​ పరికరం. మొత్తం పరికరం నుంచి ఒక భాగాన్ని తీసుకుని వెళ్లొచ్చు. సాధారణంగా చికిత్స జరిగేటప్పుడు తల్లి నుంచి వేరుగా ఉంచి వీరికి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఒకసారి చికిత్స ఆపితే మళ్లీ మొదటి నుంచి చేయాల్సి ఉంటుంది. కావున మా పోర్టబుల్​ పరికరంతో అలాంటి ఇబ్బంది ఉండదు. ఆ పరికరాన్ని చిన్నారితో పాటు తల్లి తనతో తీసుకువెళ్లేలా ఉంటుంది. ఈ పరికరం వల్ల పిల్లలకు త్వరగా చికిత్స జరుగుతుంది." -ప్రసాద్‌ ముద్దం, పరికరం ఆవిష్కర్త

ఇతర పరికరాలకు, ఎన్​లైట్​కు మధ్య తేడా ఏంటంటే.. "పిల్లలకు సంబంధించిన ఆరోగ్య వివరాలను 'ఎన్​లైట్​ 360' పరికరమే విశ్లేషించుకుని దాని ప్రకారం చికిత్స అందిస్తుంది. ఒక సాధారణ వైద్యుడు కూడా ఈ పరికరం ద్వారా చికిత్స అందించవచ్చు. దీని ద్వారా నర్సింగ్​హోమ్​లలో కూడా ఉన్నత స్థాయి వైద్యాన్ని అందించవచ్చు. ఈ పరికరం ఒకసారి ఛార్జింగ్​ చేస్తే 12 గంటల పాటు వినియోగించుకోవచ్చు. దీనిని సోలార్​ విద్యుత్​ ద్వారా కూడా వాడుకోవచ్చు. మొబైల్​ పవర్​ బ్యాంక్​ ద్వారా కూడా ఈ పరికరానికి ఛార్జింగ్​ అందించవచ్చు." -ప్రసాద్‌ ముద్దం, పరికరం ఆవిష్కర్త

ఈ పరికరం ద్వారా ఫలితాలు ఎలా ఉన్నాయంటే.. "మేము దీనిని హైదరాబాద్​లోని కామినేని ఆస్పత్రి నుంచి ప్రారంభించాం. తయారీ సమయంలో అక్కడే దీనిపై పరిశోధనలు చేశాం. ప్రస్తుతం ఈ పరికరం క్లినికల్​ ఎవాల్యూయేషన్​లో ఉంది. ఇది అయిపోయాకా మార్కెట్​లో లాంఛ్​ చేస్తాం. రాబోయే ఆరు నెలల్లో దీనిని మార్కెట్​లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంటెలిజెంట్ ఫొటోథెరపీ యూనిట్‌." -ప్రసాద్‌ ముద్దం, పరికరం ఆవిష్కర్త

ఇదీ చదవండి: నిద్ర సరిగా పట్టకపోతే.. అన్ని ఆరోగ్య సమస్యలా?

ABOUT THE AUTHOR

...view details