రెండు రోజుల క్రితం 9వ తరగతి చదివే విద్యార్థి నెల్లూరు నగరంలో అనుమానాస్పదంగా రైలు పట్టాల వద్ద శవంగా కనిపించాడు. ఇంటి నుంచి వెళ్లిన అతడు శవమై కనిపించాడు. ఇది ఎలా జరిగింది?
ఆదివారం రాత్రి నెల్లూరు విజయమహల్ గేటు వద్ద బీటెక్ చదివే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్నేహితులతో కలసి బయటకు వెళ్లిన ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఎందుకు జరిగిందో వివరాలు బయటకు రాలేదు.
ఇటీవల ఒకేరోజు వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు రైలు పట్టాలపై చనిపోయి పడున్నారు. వీరిలో ఒక మహిళ, ఒక యువకుడు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అసలు వీరెందుకు మృతి చెందినట్లు, ఈ ఘటనలు ప్రమాదవశాత్తు జరిగాయా? లేదా ఆత్మహత్యలు చేసుకున్నారా అనేది ఇప్పటికీ తేలలేదు.
రోజూ జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో రైలు పట్టాలపై చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రాణాలు వదులుతున్నారు. రైల్వే పోలీసులు మాత్రం రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు కేసులు నమోదు చేస్తున్నారు. వీటి వెనక ఉన్న కారణాలేమిటో మాత్రం తెలుసుకోలేకపోతున్నారు.
నిత్య ప్రమాదాలు
ఏపీలోని నెల్లూరు జిల్లాలో కావలి నుంచి తడ వరకు 144 కిలోమీటర్లు, అలాగే గూడూరు నుంచి వెంకటగిరి మీదుగా అక్కుర్తి స్టేషన్ వరకు 55 కిలోమీటర్ల మేర రైలు మార్గాలు ఉన్నాయి. మొత్తం 199 కిలోమీటర్ల మేర జిల్లాలో రైలుమార్గం వెళ్తుంది. పలుచోట్ల రహదారులను ఆనుకొని రైలు పట్టాలు ఉండగా, కొన్ని ప్రాంతాల్లో విడిగా ఉన్నాయి. పలు రాష్ట్రాలకు జిల్లా మీదుగా రైళ్లు వెళ్తుంటాయి. జిల్లాలో నెల్లూరు, కావలి, గూడూరు ప్రధాన స్టేషన్లుగా ఉన్నాయి. వీటి పరిధిలో జీఆర్పీఎఫ్, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తుంటారు. అలాంటి ఇక్కడ నిత్యం రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎందరో తమ ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, మరికొందరు ప్రమాదవశాత్తు మృతి చెందుతున్నారు. పట్టాలపై మృతదేహాలు కనిపించిన ప్రతిసారి రైల్వే పోలీసులు ప్రమాదాలుగా కేసులు నమోదు చేసుకుంటున్నారు. గుర్తుతెలియని రైలు ఢీకొని, రైలు నుంచి జారిపడి అని వివరాలు పొందుపరుస్తూ కేసులు రాస్తున్నారు. అంతేగానీ ఏం జరిగింది, ఎందుకు జరిగింది.. ఎలా జరిగిందనే వివరాలు తెలుసుకోవడంలో విఫలమవుతున్నారు. దీంతో కొన్ని కేసులు మిస్టరీగానే మిగిలిపోతున్నాయి.
ఎందుకిలా?