Musi Floods: రాష్ట్రంలో ఎగువ కురుస్తున్న వర్షాలు, జంట జలాశయాల నుంచి దిగువకు వస్తున్న జలాలతో మూసీ నది పరవళ్లు తొక్కుతోంది. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వరదతో మూసారాంబాగ్, చాదర్‌ఘాట్ వంతెనలు మూసివేశారు. మూసారాంబాగ్ వంతెనపై నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వంతెనకు రెండువైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. మూసారాంబాగ్ వంతెన మూసివేయడంతో అంబర్ పేట్ -మలక్ పేట్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
ట్రాఫిక్ జామ్ కావడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మూసానగర్, కమలానగర్ పరిసరాలను వరద చుట్టుముట్టింది. అంబర్పేట్ , మలక్‌పేట్, రత్నానగర్, పటేల్‌నగర్ , గోల్నాకలో మదర్సా, శంకర్ నగర్ , మూసానగర్ నుంచి సుమారు రెండువేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. హరేకృష్ణ సంస్థ ద్వారా ఆహారం సరఫరా చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయ కార్యక్రమాలు చేపట్టారు. వరదలు వచ్చినప్పుడల్లా తమకు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయని.. శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
జియాగూడ వద్ద మూసీ పరవళ్లు తొక్కుతోంది. లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తుతోంది. ప్రవాహ తీవ్రత దృష్ట్యా జియాగూడ ప్రాంతంలో వాహనరాకపోకలను అధికారులు నియంత్రిస్తున్నారు. వరద తీవ్రంగా ఉన్నందున సమీప ప్రాంత ప్రజలు చూసేందుకు వెళ్లి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని సూచిస్తున్నారు. పురానాపూల్ శ్మశాన వాటికను వరద ముంచెత్తింది. అంత్యక్రియలు చేసే ప్రదేశంలో జలాలు చుట్టుముట్టాయి. నదిని ఆనుకునే ఉన్న స్మశాన వాటిక ప్రహారీ గోడపై నుంచి మూసీ ప్రవహిస్తోంది. దహన వాటికలు ముంపునకు గురికావడంతో అంత్యక్రియలు చేసుకునేందుకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. వరద తగ్గితేనే మళ్లీ అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంటుంది.