Murder Cases in Telangana : నవ మాసాలు కని పెంచిన తల్లి కోసం ప్రాణాలైనా ఇస్తారు.. కన్న బిడ్డలు..! అన్నదమ్ముల్లో ఏ ఒక్కరికి ఏమైనా మరొకరు తల్లడిల్లిపోతారు. భర్త పదికాలాల పాటు ప్రాణాలతో ఉండాలని ఏ భార్య అయినా కోరుకుంటుంది. కానీ రాష్ట్రంలో జరిగిన పలు ఘటనల్లో బంధువులే హంతకులుగా మారారు. దారుణంగా హత్య చేసి కుటుంబ బంధాలకు మాయని మచ్చగా మిగిలారు.
Daughter killed her mother : నిజామాబాద్ జిల్లాలో కన్నతల్లినే కుమార్తె అత్యంత దారుణంగా కడతేర్చింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిపేట్ మండలం ఉమ్మెడకు చెందిన నాగం నర్సు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోందని తెలిపారు. ఆమె భర్త 20ఏళ్ల క్రితం చనిపోవడంతో ఇంట్లో ఒక గదిలో ఒంటరిగా ఉంటోందని చెప్పారు. మరో గదిలో ఆమె పెద్ద కూతురు నాగం హరిత ఉంటుందని వివరించారు. తల్లీకూతుళ్ల మధ్య కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయని చెప్పారు.
ఈ క్రమంలోనే ఈ నెల 26న నాగం నర్సు రెండో కూతురు ఇంట్లో జరిగిన ఫంక్షన్ విషయంపై.. పెద్ద కుమార్తె హరితతో తీవ్ర వాగ్వాదం జరిగిందని పోలీసులు తెలిపారు. దీంతో హరిత, తల్లిపై రోకలి బండతో దాడిచేసి దారుణంగా హత్య చేసిందని వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పోలీసులు పేర్కొన్నారు.