ఆంధ్రప్రదేశ్‌లోని సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై సీఆర్పీసీ సెక్షన్ 174 కింద నమోదు చేసిన ఎఫ్ఐఆర్కు కొత్త సెక్షన్లు చేర్చి.. ఐపీసీ సెక్షన్లతో ఎఫ్‌ఐఆర్ 'రీ రిజిస్టర్' ఎలా చేస్తారని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. అందుకు ఏ ఆధారాలు ఉన్నాయన్న న్యాయస్థానం.. ఆ వివరాలను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ.. మృతుడు సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా హైకోర్టు విచారణ చేపట్టింది.
సీబీఐకి అప్పగించే విషయంలో నిందితుడి వాదనలు వినాల్సిన అవసరం లేదని పిటిషనర్ తరుఫున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఎమ్మెల్సీ అనంతబాబు భార్య, ఇతరుల సమక్షంలో హత్య జరిగిందని వివరించారు. సీసీటీవీ ఫుటేజ్‌లో నిందితుడి భార్య, ఇతరులు కనిపిస్తున్నా.. వారిపై కేసు నమోదు చేయకుండా ఎఫ్ఎస్ఎల్ నివేదిక కోసం వేచిచూస్తున్నామని కాలం వెళ్లదీస్తున్నారని తెలిపారు. నిందితుడు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కావడంతో పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో దర్యాప్తు చేయడం లేదన్నారు. హోంశాఖ తరఫు న్యాయవాది మహేశ్వరరెడ్డి దర్యాప్తు నిష్పాక్షికంగా చేస్తున్నామని కోర్టుకు తెలిపారు. ఇరు వర్గాల వాదనల తరువాత విచారణను హైకోర్టు డిసెంబర్ 12కి వాయిదా వేసింది.