కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన 1,433 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే విడుదల చేయాలని లేఖలో కోరారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులు కూడా ఇవ్వలేదని... 2,711కోట్ల రూపాయలను సిఫారసు చేస్తే కేవలం 2,502 కోట్లు మాత్రమే వచ్చాయని కేటీఆర్ తెలిపారు.
పనితీరు ఆధారంగా రావాల్సిన 677కోట్లకు గాను కేవలం 235 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. మొత్తంగా 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు 650కోట్ల రూపాయలు రాలేదని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో 15వ ఆర్థిక సంఘం మిలియన్‌కు పైగా జనాభా ఉన్న హైదరాబాద్‌కు 468కోట్లు, మిలియన్‌కు తక్కువ జనాభా ఉన్న నగరాలకు 421 కోట్ల రూపాయలను సిఫారసు చేసిందని... అందులో ఇప్పటి వరకు కేవలం 105 కోట్లు మాత్రమే విడుదల చేశారని చెప్పారు.
కొవిడ్ మహమ్మారి నియంత్రణకు పోరాడడంతోపాటు ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని... ఇదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రధానంగా దృష్టి సారించినట్లు ఆయన వివరించారు. కేంద్ర ఆర్థిక సంఘం నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో అదనపు మ్యాచింగ్ గ్రాంటును కూడా పొందుపరిచిందన్నారు.
అసలే కరోనా కారణంగా ఖజానాకు ఆదాయం పడిపోగా.. కేంద్రం నుంచి చట్టబద్ధంగా రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు కూడా రాకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని కేటీఆర్ లేఖలో వివరించారు. వీటన్నింటి నేపథ్యంలో 14వ ఆర్థిక సంఘం పెండింగ్ నిధులైన 650 కోట్లతోపాటు 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన 883కోట్ల రూపాయలు తక్షణమే విడుదలయ్యేలా చూడాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి కూడా లేఖను పంపారు.
ఇదీ చదవండి: రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు : వాతావరణ శాఖ