పురపాలక ఎన్నికల కోసం ఆ శాఖ రంగం సిద్ధం చేస్తోంది. వార్డుల పునర్విభజన ప్రక్రియకు సంబంధించిన అభ్యంతరాలు, అభిప్రాయాలపై కసరత్తు ప్రారంభించింది. వార్డుల పునర్విభజన ముసాయిదాను పురపాలక శాఖ ఈ నెల మూడో తేదీ విడుదల చేసింది. ముసాయిదాపై ఏడు రోజుల పాటు నిన్నటి వరకు ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి అభ్యంతరాలు, అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు.
ఈనెల 17న వార్డుల పునర్విభజనకు తుది నోటిఫికేషన్ - municipal elections in telangana 2019
పురపాలక ఎన్నికల కోసం వార్డుల పునర్విభజన ప్రక్రియకు సంబంధించిన అభ్యంతరాలు, అభిప్రాయాలపై పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు 121 మున్సిపాల్టీలు, పది కార్పొరేషన్లకు సంబంధించిన వార్డుల పునర్విభజన ముసాయిదాను పురపాలక శాఖ ఈ నెల మూడో తేదీ విడుదల చేసింది.
మొత్తం పది కార్పొరేషన్లు, 121 మున్సిపాల్టీల్లో వార్డుల విభజనకు సంబంధించి 1,892 అభ్యంతరాలు, సూచనలు అందాయి. ఈ సంఖ్య కరీంనగర్లో అత్యధికంగా ఉన్నట్లు సమాచారం. నల్గొండ, మిర్యాలగూడ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
అన్ని చోట్లా వచ్చిన అభ్యంతరాలు, సూచనలను పురపాలక శాఖ పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను 16వ తేదీ వరకు పూర్తి చేయాలి. ఈ నెల 17వ తేదీన వార్డుల పునర్విభజనకు సంబంధించిన తుదినోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ తర్వాత అందుకు అనుగుణంగా వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం చేపడుతుంది.