త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఐదు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. వెంటనే ఏర్పాట్లు ప్రారంభించాలని సర్కారును ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లను ప్రభుత్వం చేయడం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇదే విషయమై బీసీ సంక్షేమ సంఘం కూడా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. జులై 2 నాటికి రాష్ట్రంలో 53 మున్సిపాలిటీలకు పదవీ కాలం ముగియనున్నదని... అయినప్పటికీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయడం లేదని పిటిషన్లో పేర్కొంది.
119 రోజుల్లో
విచారణ సందర్భంగా ఐదు నెలల సమయం కావాలని సర్కారు హైకోర్టును కోరింది. మొత్తం ఎన్నికలకు అవసరమైన ప్రక్రియ పూర్తి చేసేందుకు 119 రోజులు అవసరమని నివేదించింది. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తే.. 30 రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇరువాదనలు విన్న హైకోర్టు నేటి నుంచి 119 రోజుల్లో వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు వంటి ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తర్వాత 30 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.'
ఇవీ చూడండి: 'నూటికి నూరు శాతం పార్టీ మారతా'