తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్పొరేషన్లు, పురపాలక సంస్థలలో ఎన్నికల వేడి - కార్పొరేషన్లు, పురపాలక సంస్థలలో ఎన్నికల వేడి

రాష్ట్రంలో మొత్తం వార్డులు, డివిజన్లు 3,148 ఉండగా తెరాసలో ఆశావహులు 15 వేల మందికి పైనే ఉన్నారు. కొన్ని చోట్ల వార్డుకు పది మందికి పైగా పోటీలో ఉన్నారు. రిజర్వేషన్లపై స్పష్టత వచ్చిన నేపథ్యంలో పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై దృష్టి సారించాయి.

MUNICIPAL ELECTIONS IN TELANAGANA
కార్పొరేషన్లు, పురపాలక సంస్థలలో ఎన్నికల వేడి

By

Published : Jan 7, 2020, 6:14 AM IST

పురపాలక ఎన్నికల రిజర్వేషన్లు పలుచోట్ల నేతల అంచనాలను తలకిందులు చేశాయి. కొన్ని ముఖ్య కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు మహిళలకు కేటాయించడంతో అభ్యర్థుల ఎంపిక ఆయా పార్టీలకు సవాల్‌గా మారింది. జనరల్‌ స్థానాలే అవుతాయని భావించి కొన్ని చోట్ల కొందరు నేతలు పోటీకి సిద్ధమయ్యారు. అనూహ్యంగా ఆయా స్థానాలు మహిళలకు రిజర్వ్‌కావడంతో ఇప్పుడు కొత్త అభ్యర్థులను గుర్తించే ప్రక్రియకు పార్టీలు శ్రీకారం చుట్టాయి. అన్ని పార్టీల్లోని ముఖ్య నేతలకు ఈ ఎన్నికలు పరీక్షగా మారాయి. గెలిస్తేనే నిలిచేదని కేసీఆర్‌ ఇప్పటికే మంత్రులకు అల్టిమేటమివ్వడంతో నేతలు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. మరోపక్క తమ సత్తా చాటాలని కాంగ్రెస్‌, భాజపాలోని ముఖ్యనేతలు తమ శక్తియుక్తులు కూడగట్టే పనిలో పడ్డారు. రాష్ట్రంలో 120 పురపాలక సంఘాలు, 10 నగరపాలక సంస్థల్లో పాగా వేసేందుకు అధికార తెరాస పూర్తి భరోసాతో ఉండగా కాంగ్రెస్‌, భాజపాలు లోక్‌సభ ఎన్నికల ఫలితాల ధీమాతో ఉన్నాయి. రెండు మూడు రోజుల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కొలిక్కి తెచ్చేందుకు ఆయా పార్టీల నేతలు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. అభ్యర్థుల ఎంపిక సహా పూర్తి ఎన్నికల బాధ్యతను మంత్రులు, ఎమ్మెల్యేలకు తెరాస అప్పగించగా.. స్థానికంగానే చర్చించి ఎంపిక చేసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు లేనిచోట పోటీ చేసి ఓడిన అభ్యర్థులు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ స్థానిక నేతలు కమిటీలుగా ఏర్పడి కాంగ్రెస్‌లో ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తున్నారు. కరీంనగర్‌, నిజామాబాద్‌, హైదరాబాద్‌ చుట్టపక్కల ఉన్న నగరపాలక సంస్థలు, ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోని స్థానాలపై భాజపా ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.రాజకీయంగా మూడు పార్టీలకూ కీలకమైన నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో మహిళా అభ్యర్థులను గుర్తించేందుకు తెరాస, కాంగ్రెస్‌, భాజపాలు ప్రత్యేక దృష్టి సారించి కసరత్తు ప్రారంభించాయి.

తెరాసలో సర్దు‘పాట్లు’

టికెట్ల కోసం తెరాసలో పెద్దఎత్తున పోటీ నెలకొనడంతో సర్దుబాటు చేసి, అన్ని విధాలా అనుకూలమైన అభ్యర్థులను ఎంపిక చేయడం శాసనసభ్యులకు కత్తిమీద సాములా మారింది. ఇప్పటికే పార్టీ ఇన్‌ఛార్జులు, సర్వే బృందాలు జాబితాలను సిద్ధం చేశాయి. వీటితో పాటు ఎమ్మెల్యేలు సైతం సొంతంగా జాబితాలను రూపొందించారు. సమన్వయంతో అభ్యర్థులను ఎంపిక చేయాలని, ఉద్యమకారులకు ప్రాధాన్యమివ్వాలని అధిష్ఠానం ఆదేశించింది. దీంతో పాటు అన్ని రకాల బలంగా ఉన్న వారిని, బలమైన సామాజిక వర్గం వారినీ పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఎమ్మెల్యేలు, మంత్రులకు బాధ్యతలప్పగించినా చాలా చోట్ల ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతల ద్వారా కొందరు పైరవీలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు ఎంపిక జాబితాలను నేరుగా అధిష్ఠానానికి పంపి ఆమోదం తీసుకుంటున్నారు.గద్వాల పురపాలక సంఘానికి సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఇలాగే పూర్తి చేశారు. టికెట్లను ఆశించే వారికి ప్రత్యామ్నాయంగా నియమిత పదవులనిస్తామని హామీ ఇవ్వాలని అధిష్ఠానం చెప్పింది. సిరిసిల్లలో కేటీఆర్‌ ఈ వ్యూహాన్ని అమలు చేశారు. ఇతర చోట్ల ఇది కొంత మేరకు ప్రభావం చూపుతున్నా చాలా మంది పురపాలక టికెట్లనేే ఆశిస్తున్నారు. మరోపక్క హైదరాబాద్‌ చుట్టపక్కల గత ఎన్నికల వరకూ గ్రామ పంచాయతీలుగా ఉండి తాజాగా నగరపాలక సంస్థలుగా మారిన ప్రాంతాల్లో మేయర్‌ పీఠాలకు గట్టిపోటీ ఉంది. ఆయా పంచాయతీల మాజీ సర్పంచులు ఎవరికి వారు పట్టుబడుతున్నారు.

కాంగ్రెస్‌లో ముఖ్యనేతలపైనే భారం

పురపాలక ఎన్నికల్లో సత్తాచాటేందుకు కాంగ్రెస్‌ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది. పార్టీ సీనియర్‌నేతలు, ముఖ్యనేతలంతా కూడా వారి వారి పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల బాధ్యతను తీసుకుని కసరత్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే రిజర్వేషన్లపై స్పష్టత వచ్చిన నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. నామినేషన్లకు సిద్ధం చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా ముఖ్యనేతలకు వారి వారి పరిధిలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. పార్లమెంట్‌ సెగ్మెంట్ల వారీగా ఈ సారి ఎంపీలు, ఎంపీ అభ్యర్థులు ప్రధానంగా బాధ్యతలు తీసుకున్నారు. కాంగ్రెస్‌లో కీలక నేతలైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, షబ్బీర్‌అలీ, కొండా విశ్వేశ్వరరెడ్డి, జగ్గారెడ్డి, పొన్నాల, దామోదర రాజనర్సింహ, సంపత్‌కుమార్‌, వంశీచంద్‌రెడ్డి సహా ముఖ్యనేతలంతా పురపాలక ఎన్నికలపై ప్రత్యేక దృష్టిసారించారు.

  1. గత ఎన్నికల్లో జగిత్యాలను కాంగ్రెస్‌ దక్కించుకోగా ఈ సారి కూడా హస్తగతం చేసుకునేందుకు జీవన్‌రెడ్డి పూర్తి స్థాయిలో కార్యాచరణ రూపొందించుకున్నారు.
  2. రేవంత్‌రెడ్డి మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ పరిధిలోని నగరపాలక సంస్థలైన నిజాంపేట, జవహర్‌నగర్‌, పీర్జాదిగూడ, బోడుప్పల్‌తో పాటు పది పురపాలక సంఘాల బాధ్యతలు తీసుకున్నారు. కీలకమైన నిజామాబాద్‌, కరీంనగర్‌ కార్పొరేషన్లపై షబ్బీర్‌అలీ, పొన్నంప్రభాకర్‌లు దృష్టిసారించారు.
  3. నల్గొండ పురపాలక సంఘం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు కీలకంగా మారింది.
  4. మధిర, కొత్తగూడెం, ఇల్లందు బాధ్యతలను మల్లు భట్టివిక్రమార్క తీసుకున్నారు.
  5. సంగారెడ్డి, సదాశివపేట జగ్గారెడ్డికి, అందోలు దామోదర రాజనర్సింహకు సవాల్‌గా మారింది. పార్టీ స్థానిక నేతల మధ్య సమన్వయం కోసం పీసీసీ పలువురికి బాధ్యతలు అప్పగించింది. చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని మున్సిపాలిటీల బాధ్యత మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తీసుకుని అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించారు.

తెరాసలో ఒక్కో టికెట్‌కు అయిదుగురు పైనే...

సర్వేలు, అభిప్రాయసేకరణల ఆధారంగా రూపొందించిన ఆశావహుల జాబితా ప్రకారం ఒక్కోస్థానానికి అయిదుగురు కంటే ఎక్కువ మంది అభ్యర్థులే ఉన్నారు.

  1. కరీంనగర్‌, నిజామాబాద్‌, రామగుండం, బోడుప్పల్‌, పీˆర్జాదిగూడలో ఒక్కో స్థానానికి ఏడు నుంచి ఎనిమిది మంది టికెట్లను ఆశిస్తున్నారు.
  2. నిజాంపేట, మీర్‌పేటలో పది మంది చొప్పున ప్రయత్నాల్లో ఉన్నారు.
  3. పురపాలక సంఘాల్లో మహబూబ్‌నగర్‌లో ఆరేసి మందితో జాబితాలు సిద్ధమయ్యాయి. మేడ్చల్‌, నల్గొండ, కాగజ్‌నగర్‌, ఆదిలాబాద్‌, జనగామ, ఇల్లందు, నాగారం, లక్షెట్టిపేట, జగిత్యాల, బోధన్‌, కోదాడ, సత్తుపల్లి, మిర్యాలగూడ, మహబూబాబాద్‌, కొత్తగూడెం, సూర్యాపేట, మెదక్‌, వికారాబాద్‌, వనపర్తి, హుజురాబాద్‌, శంషాబాద్‌, కాగజ్‌నగర్‌, తాండూరు, జమ్మికుంట, పెద్దపల్లి, కామారెడ్డి, ఎల్లారెడ్డి, నర్సంపేట, భూపాలపల్లి, పెద్దఅంబర్‌పేట, కోరుట్ల తదితర చోట్ల అయిదుగురు చొప్పున టికెట్లు అడుగుతున్నారు.
  4. చిన్న చిన్న పురపాలక సంఘాలైన పెబ్బేరు, తూముకుంట, ఆదిభట్ల, మంథని, అమీన్‌పూర్‌లలో సైతం ఎనిమిది మంది చొప్పున రంగంలో ఉన్నారు.

బరిలో వామపక్షాలు, తెజస, తెదేపా

తమకు పట్టున్న పూర్వ ఖమ్మం, నల్గొండ, వరంగల్‌లోని ప్రాంతాలపై వామపక్షాలు దృష్టి సారించాయి. కలిసి పోటీచేయాలా.. లేదా.. ఇంకా నిర్ణయించుకోలేదు. కోదండరాం నేతృత్వంలోని తెజస 450 నుంచి 500 వార్డులు, డివిజన్లల్లో పోటీ చేయనున్నాయి. ఇటీవల తెదేపా అధినేత చంద్రబాబు పచ్చజెండా ఊపడంతో పోటీపై తెలంగాణ తెదేపా నాయకులు వ్యూహరచన చేస్తున్నారు.

జోష్‌ కొనసాగిస్తామంటున్న భాజపా

  • నాలుగు ఎంపీ స్థానాలు గెలుపొందిన జోష్‌లో ఉన్న భాజపా దాన్ని కొనసాగించాలనే కృతనిశ్చయంతో ఉంది. రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో ఒంటరిగా పోటీ చేయాలని పార్టీ నిర్ణయించింది. ఎంపీల పరిధిలోని కార్పొరేషన్లు, నగరపాలక సంస్థలపై ప్రత్యేక దృష్టి సారించింది.
  • గతంలో గెలిచిన భువనగిరి, నారాయణపేట పురపాలికలు, అంతకు ముందు విజయం సాధించిన నేటి నగరపాలక సంస్థ నిజామాబాద్‌..మున్సిపాలిటీలు ఆదిలాబాద్‌, నల్గొండ, సంగారెడ్డి, తాండూరు, బైంసాల్లో తిరిగి పాగా వేయాలని యత్నిస్తోంది. కరీంనగర్‌ నగరపాలికపై పట్టు కోసం బండి సంజయ్‌ కృషి చేస్తుండగా... నిజామాబాద్‌లో అమీతుమీకి ఎంపీ అర్వింద్‌ సిద్ధమవుతున్నారు.
  • హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న 7 కార్పొరేషన్లు, 18 నగరపాలక సంస్థలపై పట్టు సాధించేందుకు కసరత్తు చేస్తోంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో మహారాష్ట్ర, కర్ణాటక నేతలు భాగస్వాములు కానున్నారు. పురపాలికల్లో మౌలికవసతులు కల్పించడంలో తెరాస విఫలమైందని.. అదే సందర్భంలో పట్టణాలకు కేంద్రం ఏవిధంగా ప్రాధాన్యమిస్తుందోప్రచారంలో వివరించాలని పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details