మూడేళ్ల క్రితం జరిగిన పురపాలక ఎన్నికల్లో అధికార గులాబీ పార్టీ ఘన విజయం సాధించి కొన్నింటిని మినహాయిస్తే అన్ని నగరాల మేయర్లు, పట్టణాల ఛైర్‌పర్సన్ల పదవులను దక్కించుకుంది. ఈ పదవుల కోసం పార్టీలో పోటీ తీవ్రంగా ఉండేది. ఏదో రకంగా సర్దుబాటు చేసి అప్పటికి ఎన్నిక ప్రక్రియను పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పురపాలక చట్టం ప్రకారం ప్రస్తుతం మేయర్, ఛైర్‌పర్సన్ ఎన్నికైన 3 సంవత్సరాల తర్వాత అవిశ్వాసం ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. అయితే పదవుల కోసం పోటీ తీవ్రంగా ఉండటం, ఇతర ఇతర కారణాలతో అవిశ్వాసానికి అవకాశం ఉంటుందని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త పడింది.
కాలపరిమితి బిల్లుపై గవర్నర్ ఆమోదం ఎప్పుడో?:అసలే 2023 శాసనసభ ఎన్నికల ఏడాది కావడంతో అవిశ్వాసాలు తలనొప్పిగా మారతాయని భావించి పురపాలక చట్ట సవరణకు శ్రీకారం చుట్టింది. మేయర్, ఛైర్‌పర్సన్‌లపై అవిశ్వాసానికి కాలపరిమితిని 3 నుంచి నాలుగేళ్లకు పెంచుతూ చట్ట సవరణ బిల్లును తీసుకొచ్చింది. ఉభయ సభల ఆమోదం కూడా లభించింది. ఇంతవరకూ బాగానే ఉన్నప్పటికీ బిల్లు చట్ట రూపం కాకపోవడంతో సమస్య ఏర్పడింది. శాసనసభ, మండలి ఆమోదించిన పురపాలక చట్ట సవరణ బిల్లు సహా ఇతర బిల్లులకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలపలేదు. దీంతో అవిశ్వాస కాలపరిమితి ఇప్పటికీ మూడేళ్లుగానే ఉంది.
అవిశ్వాసం దిశగా బీఆర్‌ఎస్ నేతల అడుగులు:మూడేళ్ల తర్వాత అవిశ్వాసం ప్రవేశపెట్టొచ్చన్న అవకాశాన్ని ఆసరాగా చేసుకుంటున్న బీఆర్‌ఎస్ నేతలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల వేళ ఛైర్‌పర్సన్ పదవులు దక్కకపోవటంతో పార్టీ నేతలు, ఎమ్మెల్యేల బుజ్జగింపులతో కొందరు, మూడేళ్ల తర్వాత ఛైర్మన్ పదవి ఇస్తామన్న హామీలతో ఆశావహులు అప్పట్లో వెనక్కి తగ్గారు. మూడేళ్ల కాలపరిమితి 27తో ముగియడంతో అసంతృప్తులు ఒక్కొక్కరుగా అవిశ్వాసాల గళమెత్తుతున్నారు.
కొన్ని జిల్లాలో అవిశ్వాసం కోసం నోటీస్‌లు జారీ: ఈ క్రమంలోనే మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ మేయర్, రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట, ఇబ్రహీంపట్నం, వికారాబాద్ జిల్లా తాండూర్ వికారాబాద్ తదితర పట్టణాల మున్సిపల్ ఛైర్‌పర్సన్‌లపై అవిశ్వాసం కోసం కౌన్సిలర్లు నోటీస్ ఇచ్చారు.
మేడ్చల్ జిల్లాలో:మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్ నగరపాలక సంస్థలో మేయర్ మేకల కావ్య సహా 28 మంది కార్పొరేటర్లుండగా.. మేయర్ తీరుపై డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ నేతృత్వంలో 20 మంది కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డికి చెప్పిన పనులనే చేస్తున్నారని, సొంత డివిజన్‌లో కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేయించారని ఆరోపిస్తున్నారు. రెండ్రోజుల క్రితం వీరంతా బస్సులో శిబిరానికి తరలివెళ్లగా.. నిన్న న్యాయవాది ద్వారా అవిశ్వాస తీర్మానం ఇప్పించారు. అసమ్మతి కార్పొరేటర్లను బుజ్జగించేందుకు మంత్రి యత్నించినా వారు ససేమిరా అన్నట్లు తెలుస్తోంది.