కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు ముగిశాయి. రాయదుర్గం గౌడ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో పూర్తి చేశారు. కుటుంబసభ్యులు, పార్టీలకు అతీతంగా రాజకీయనేతలు, అభిమానులు చివరిసారిగా ఆయనకు అశ్రునయనాలతో నివాళులర్పించారు.
ముఖేశ్ గౌడ్‌తో ఉన్న అనుబంధాన్ని పలువురు నేతలు గుర్తు చేసుకున్నారు. కార్పొరేటర్ నుంచి మంత్రి వరకు వివిధ పదవులు అనుభవించారన్నారు. ఏ పదవిలో ఉన్న ప్రజాసంక్షేమం కోసం ఆలోచించే వారని... ఆయన మరణం రాష్ట్రానికి, కాంగ్రెస్‌కు తీరని లోటని తెలిపారు. ఆయన కుటుంబానికి హస్తం పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఉదయం జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి ముఖేశ్ గౌడ్ పార్థివదేహాన్ని జాంబాగ్‌లోని ఆయన పాత నివాసానికి తీసుకెళ్లారు. స్థానికుల సందర్శనార్థం కొద్దిసేపు అక్కడే ఉంచారు. ఆతర్వాత గాంధీభవన్‌కు తరలించారు. అనంతరం అక్కడి నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానుల నినాదాలతో రాయదుర్గంలోని గౌడ శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగింది. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, గీతారెడ్డి వి.హన్మంతరావు, దామోదర రాజనరసింహతోపాటు పాటు వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నేత ముఖేశ్‌గౌడ్‌కు అంతిమ వీడ్కొలు ఇవీ చూడండి:ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది: జీవన్‌రెడ్డి