'కొత్త సచివాలయం నిర్మాణం సుప్రీం తీర్పుకు విరుద్ధం' హైదరాబాద్‌లోని లక్డీకాపూల్ అరణ్య భవన్‌లో ఎన్జీటీ కమిటీతో ఎంపీ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కొత్త సచివాలయ నిర్మాణం, అనుమతులపై రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకు పలు శాఖలు ఇచ్చిన అనుమతులు సుప్రీంకోర్టుకు వ్యతిరేకమని ఆయన కమిటీకి వెల్లడించారు.
పాత సచివాలయ కూల్చివేత, పర్యవసానాల వ్యవహారాలపై ఎన్జీటీ నియమించిన నిపుణుల కమిటీ కూల్చివేతకు గురైన సచివాలయ ప్రాంగణాన్ని ఇవాళ పరిశీలించింది. హుస్సేన్‌సాగర్ పరిధిలో ఒక కిలోమీటర్ వరకూ ఎలాంటి శాశ్వత కట్టడాలకు అనుమతి ఇవ్వకూడదని 2001లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కమిటీ దృష్టికి రేవంత్ తీసుకెళ్లారు.
పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని పలు నిపుణుల కమిటీలు ఇదే విధమైన నివేదికలు కూడా ఇచ్చినట్లు రేవంత్ వెల్లడించారు. 2001 కంటే ముందు నిర్మాణాలను మినహాయిస్తే...ఆ తర్వాత కాలంలో ఈ ప్రాంతంలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వలేదని వివరించారు.
తాజాగా పాత సచివాలయం స్థానంలో కొత్త సచివాలయం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. అందుకు పలు శాఖల నుంచి అనుమతులు తెచ్చుకునే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఇది 2001లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు పలు నిపుణుల కమిటీల నివేదికలకు వ్యతిరేకమని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికే అనుమతులు ఇచ్చిన ఆయా శాఖల నుంచి వివరణ కోరి, సదరు అనుమతులను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి :'జీరో అవర్‌లో హీరోగిరి చేస్తానంటే ఎట్లా అధ్యక్షా..!'