Green India Challenge: "స్త్రీ" చదవడానికి ఒక్క అక్షరమే అయినా అందులో అమ్మలా లాలించే ప్రేమ ఉంది. అక్కలా మనకు ధైర్యం చెప్పే బలమైన మాట ఉంది. జీవితాంతం మనకు తోడుగా ఉండే భార్య పిలుపు ఉంది. కుటుంబానికి కలకాలం దాసిలా సేవ చేసే మంచి మనసు ఉంది. మన భారాన్ని మోసే భూదేవి లాంటి గొప్ప ఓర్పు ఉంది. అందుకే మనం స్త్రీ మూర్తుల సేవలను గౌరవించాలనే ప్రధాన ఉద్ద్యేశ్యంతో ఏటా మార్చి 8న ప్రపంచ మహిళ దినోత్సవం జరుపుకుంటాం.
ఈ ఏడాది మహిళ దినోత్సవం మాత్రం కొద్దిగా విభిన్నంగా జరుపుకుందామని సూచించారు గ్రీన్ ఇండియా సృష్టికర్త ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్. మహిళా దినోత్సవం రోజున స్త్రీ మూర్తులు మొక్కలు నాటాలని కోరారు. పిల్లల్ని పెంచిన చేతులు మొక్కల్ని పెంచితే.. ప్రకృతి పరవశించిపోతుందని ఎంపీ అభిప్రాయపడ్డారు. తమ పిల్లల్ని పెంచడంలో స్త్రీ మూర్తులు చూపించే ప్రేమ, జాగ్రత్త అద్భుతమని కొనియాడారు. అంతే ప్రేమతో మహిళా దినోత్సవం రోజున మొక్కలు నాటాలని కోరుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పోస్టర్ను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్ శాంతి కుమారి, ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్, సీఎం ఓఎస్డి ప్రియాంకా వర్గీస్ పాల్గొన్నారు. స్త్రీలు శక్తి స్వరూపులని, తలపెట్టిన అన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేయగలరని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మహిళలంతా ప్రకృతి పరిరక్షణ కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని సీఎస్ శాంతి కుమారి కోరారు.
అన్ని రంగాల్లో రాణిస్తూనే పుడమి బాగుకోసం మహిళలు అలుపెరగక కృషి చేస్తున్నారని కార్యక్రమంలో పాల్గొన్న స్మితా సబర్వాల్ అభిప్రాయపడ్డారు. ప్రతి మహిళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మొక్కను నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరారు.