టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు.. నామినేషన్ల జోరు Teacher MLC election in telangana: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాడి శెట్టి తిరుపతి నామినేషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ లిబర్టీ లోని జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో పలువురు 317 జీవో బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయులతో కలిసి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. సంఘాలకు అతీతంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు తనకు మద్దతు తెలపాలని కోరారు. జీవో 317 బాధితుల పక్షాన పోరాటం చేస్తానని తెలిపారు.
మహబూబ్ నగర్- రంగారెడ్డి - హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మరో స్వతంత్ర అభ్యర్థిగా బషీర్ బాగ్ కూడలి నుంచి ర్యాలీగా వచ్చి సంతోష్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్య సంస్థలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల, అధ్యాపకుల సమస్యలపై చట్ట సభలలో మాట్లాడేవారు లేరని తెలిపారు. ఓట్ల కోసం వస్తారని గెలిసినా తర్వాత అందని ద్రాక్షలాగ మారుతున్నారని పేర్కొన్నారు.
విద్యారంగ పటిష్టత, ఉపాధ్యాయుల హక్కుల రక్షణ కోసం కృషి చేస్తానని ఉపాధ్యాయ స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. గతంలో ఈ స్థానం నుండి గెలిచిన నాయకులు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారన్నారు. ప్రతి నెల ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు కూడా అందడం లేదని వారి సమస్యలను చెప్పుకునేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదన్నారు.
ఈ ఎన్నికలలో ఉపాధ్యాయులు తనను గెలిపిస్తే వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీనిచ్చారు. రెండు మూడు రోజులలో కాంగ్రెస్ పార్టీ తనకు మద్దతు ప్రకటిస్తున్నట్లు హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. కూకట్పల్లి జేఎన్టీయు మాజీ ప్రిన్సిపాల్ బి. వినయ్ బాబు తో పాటుమరో నలుగురు నామినేషన్లను దాఖలు చేశారు. హైదరాబాద్ లోకల్ అథారటీ ఎన్నికకు నాలుగో రోజు ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదని రిటర్నింగ్ అధికారి ప్రియాంక చెప్పారు.
ఇవీ చదవండి: