MMTS Trains: జంటనగరాల్లో అత్యంత కీలకమైన ప్రజారవాణా వ్యవస్థ ఎంఎంటీఎస్ రైళ్లు. కొవిడ్ -19కు ముందు 121 ఎంఎంటీఎస్ సర్వీసులు సేవలందించేవి. 1,65,000ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేవి. కరోనా భారీగా విజృంభిస్తున్న సమయంలో 18 నెలలపాటు సర్వీసులు షెడ్డులకే పరిమితమైపోయాయి. దక్షిణ మధ్య రైల్వే జూన్ 2021 నుంచి ఎంఎంటీఎస్ సర్వీసులను దశలవారీగా పునరుద్ధరించింది. ప్రస్తుతం 86 సర్వీసులను నడిపిస్తోంది.
నగరంలోని దక్షిణ, తూర్పు ప్రాంతాలను వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న పశ్చిమ ప్రాంతంతో అనుసంధానిస్తూ ఫలక్‌నుమా, సికింద్రాబాద్, హైదరాబాద్, బేగంపేట్, లింగంపల్లి -తెల్లాపూర్ -రామచంద్రాపురం ప్రాంతాల మీదుగా 29 రైల్వే స్టేషన్లను కవర్ చేస్తూ 50 కిమీల దక్షిణ మధ్య రైల్వే మేర ఎంఎంటీఎస్ సర్వీసులను నడుపుతోంది. ప్రయాణికుల రద్దీ, గమ్యస్థానాలను బట్టి సరైన ప్రాధాన్యతిస్తూ వివిధ రంగాల ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సర్వీసుల షెడ్యూలు ఏర్పాటు చేశారు. ఉద్యోగరీత్యా వెళ్లే వారికి, కుటుంబ అవసరాల మేరకు దూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులకు ఉపయోగపడేలా ఎంఎంటీఎస్ రైళ్లు ఎంతో సౌకర్యవంతంగా,అనుకూలంగా ఉంటున్నాయి.