MLAs Poaching Case Updates: శాసనసభ్యులకు ఎరవేసిన వ్యవహారంలో సూత్రధారులను గుర్తించేందుకు కీలక ఆధారాల సేకరణలో ప్రత్యేక దర్యాప్తు బృందం- సిట్ నిమగ్నమైంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సహా నలుగురిని సోమవారం విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు జారీచేసింది. ఈ మేరకు సంతోష్‌తో పాటు కొచ్చిలోని అమృత ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యుడు డాక్టర్ జగ్గుస్వామి, కేరళలోని భారత్ ధర్మ జనసేన పార్టీ అధ్యక్షుడు తుషార్, కరీంనగర్ న్యాయవాది బూసారపు శ్రీనివాస్ విచారణకు రావాల్సి ఉంది.
41ఏ సీఆర్పీసీ నోటీసులు కావడంతో వీరంతా వ్యక్తిగతంగానే సిట్ ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది. సోమవారమే విచారణకు రావాలని సిట్ నోటీసుల్లో పేర్కొన్నా.. కరీంనగర్ కు చెందిన న్యాయవాది శ్రీనివాస్ మినహా మిగతావారేవరు సిట్ ముందుకు రాలేదు. ఈ కేసులో నోటీసులు అందుకున్న కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్.. మరో న్యాయవాదితో కలిసి బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సిట్ ముందు హాజరయ్యారు
సిట్ అధికారులు శ్రీనివాస్‌ను సుదీర్ఘంగా విచారించారు. సీవీ ఆనంద్ నేతృత్వంలో డీసీపీలు రెమా రాజేశ్వరి, జగదీశ్వర్ రెడ్డితో పాటు రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్... శ్రీనివాస్‌ను ప్రశ్నించారు. శ్రీనివాస్‌కు సంబంధించిన కాల్ డేటాను ఇదివరకే సేకరించిన సిట్ అధికారులు.. దానికి సంబంధించి పలు ప్రశ్నలు వేశారు. సింహయాజీ స్వామిజీకి గత నెల 26వ తేదీన తిరుపతి నుంచి హైదరాబాద్‌కు విమానం టికెట్‌ను బుక్ చేశారు. ఆ రోజు ఎందుకు సింహయాజీ స్వామిజీని హైదరాబాద్‌కు తీసుకురావాల్సి వచ్చిందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అంతేకాకుండా నంద కుమార్‌తో గల పరిచయాలపైనా ఆరా తీశారు. నంద కుమార్‌తో తరచూ ఫోన్లో మాట్లాడటమే కాకుండా... ఫిల్మ్ నగర్లో ఉన్న డెక్కన్ కిచెన్‌కు సైతం శ్రీనివాస్ వెళ్లినట్లు సిట్ అధికారులు ఇది వరకే గుర్తించారు. దీనికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్ ఓ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి సన్నిహితుడిగా మెలుగుతున్నాడు. ఆ కోణంలోనూ సిట్ అధికారులు పలు వివరాలు సేకరించారు. పూజలు చేయించుకునే క్రమంలో సింహయాజీ స్వామిజీతో పరిచయం ఏర్పడిందని... గత 26వ తేదీన సైతం పూజ కోసమే సింహయాజీకి టికెట్ బుక్ చేసినట్లు శ్రీనివాస్, సిట్ అధికారులకు చెప్పినట్లు సమాచారం.
ఈ కేసులో ఆసక్తికరంగా మారిన పరిణామాలు: బీజేపీ కీలక నేత అయిన బీఎల్ సంతోష్‌కు నోటీసులు అందిన నాటి నుంచి ఈ కేసులో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఆయన సిట్ విచారణకు వస్తారా.. లేదా అన్న అంశం ఉత్కంఠను రేపింది. కానీ సంతోష్‌తో పాటు కేరళకు చెందిన మిగతా ఇద్దరు అనుమానితులూ సిట్ నోటీసులకు స్పందించలేదు. అనారోగ్యం, ఇతరత్రా ముందస్తు కార్యక్రమాలుంటే తప్ప నలుగురూ కచ్చితంగా సిట్ విచారణకు సోమవారమే హాజరు కావాల్సి ఉన్నా.. వారి వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
వీరు చట్టపరంగా ఉన్న రక్షణ అవకాశాలను, న్యాయపరమైన సాంకేతికాంశాలను వినియోగించుకోవచ్చని పలువురు న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. సిట్ నుంచి నోటీసులు అందుకున్న వారు విచారణకు సహకరించాలని.. పోలీసులు వారిని అరెస్టు చేయరాదని హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది. ఈ నేపథ్యంలో తదుపరి పోలీసులు వేసే అడుగులపై ఆసక్తి నెలకొంది. న్యాయవాది శ్రీనివాస్ విచారణలో కొత్త విషయాలేమైనా వెలుగులోకి వస్తాయా..? బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి పట్ల సిట్ ఎలా వ్యవహరించనుందనే అంశాలు చర్చనీయంగా మారాయి. న్యాయవాది శ్రీనివాస్‌ను రేపు మరోసారి విచారణకు హాజరుకావాలని సిట్ అధికారులు సూచించారు.
ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల ఎర కేసు పరిణామాలు ఇవీ చదవండి: