MLAs Poaching Case Update: ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితుడు నందకుమార్... అలియాస్ నందు అక్రమాల చిట్టా ఒక్కొక్కటి బహిర్గతమవుతోంది. అతడి బ్యాంకుఖాతాలు, సెల్‌ఫోన్లపై సిట్ విశ్లేషణలో.. పలువురితో అతడు సాగించిన ఆర్థిక లావాదేవీలు వెలుగులోకి వస్తున్నాయి. నందు ఇచ్చిన చెక్కులు పదుల సంఖ్యలో బౌన్స్ అయినట్లు ఇప్పటికే సిట్ గుర్తించినట్లు తెలిసింది. నందుతో గతంలో ఇబ్బందులకు గురైన బాధితులు... ముఖ్యంగా వ్యాపారభాగస్వాములుగా ఉండి విబేధాల కారణంగా బయటికి వచ్చినవారు, ఆయనతో ఆర్థిక లావాదేవీల్లో నష్టపోయినవారు పోలీసులను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
బాధితులు ఇచ్చే ఆధారాలను పరిశీలిస్తూ నందుపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నందు 7 వ్యాపార సంస్థలను నిర్వహించినట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అతడి మాయమాటలకి మోసపోయినట్లు ఓ గుట్కాసంస్థ నిర్వాహకులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. గతంలో ఆ సంస్థ ట్రేడ్‌మార్క్‌పై వివాదంతలెత్తగా.. నిర్వాహకులతో మాట కలిపిన నందు... సంస్థ నిర్వహణ సరిగా లేదని.. అమ్మేందుకు కోట్లలో డీల్ మాట్లాడదామని చెప్పి మోసగించినట్లు సమాచారం. బాధితులు ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసే యోచనలో పోలీసులున్నట్లు తెలుస్తోంది.