శాసనసభ కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది (MLA quota MLC elections). నేటి నుంచి ఈనెల 16 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 17న పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు 22వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఒకవేళ పోటీ ఉంటే నవంబర్ 29వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహించి.. అదే రోజు ఐదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. శాసనసభలో బలాల ప్రకారం ఆరు స్థానాలను తెరాస కైవసం చేసుకోవడం లాంఛనమే.
ఆశావహుల విశ్వప్రయత్నాలు
శాసనసభ కోటాలో ఎమ్మెల్సీ స్థానాల కోసం గులాబీ పార్టీలో ఆశావహులు విశ్వయత్నాలు చేస్తున్నారు. పోటీ ఎక్కువగా ఉండటంతో.. అభ్యర్థిత్వం ఖరారు చేసేందుకు తెరాస నాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. శాసన మండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ (VIDYA SAGAR), మాజీ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి (KADIYAM SRI HARI), ఆకుల లలిత, మహ్మద్ ఫరీదుద్దీన్ పదవీ కాలం జూన్ 3న ముగియడంతో ఈ ఎన్నికలు వచ్చాయి. ఈ ఆరుగురు తాజా మాజీలు మరోసారి అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. ఆరుగురిలో ఇద్దరు ముగ్గురికి రెన్యువల్ కావొచ్చునని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. గుత్తా సుఖేందర్ రెడ్డి , కడియం శ్రీహరికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ నాయకులు భావిస్తున్నారు.
వారికి ఖాయమైనట్లేనా..!
శాసనమండలిలో అడుగుపెట్టాలని దాదాపు యాభై మంది గులాబీ నేతలు ఆశిస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ నుంచి గతంలో హామీ పొందిన వారితో పాటు పలువురు నేతలు తుది ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ ఇప్పటికే పలువురికి హామీ ఇచ్చినప్పటికీ.. వివిధ అంశాలను బేరీజు వేస్తున్నారు. పద్మశాలి, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి, రజకలను కచ్చితంగా ఎమ్మెల్సీ పదవులు ఇస్తానని జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెదేపా నుంచి తెరాసలో చేరిన ఎల్.రమణ, మాజీ స్పీకర్ మధుసూదనచారికి ఖాయమైనట్లేనని పార్టీలో విస్తృత ప్రచారం సాగుతోంది. నాగార్జునసాగర్ నియోజకవర్గం నేత ఎంసీ కోటిరెడ్డిని (KOTI REDDY) ఎమ్మెల్సీ చేస్తానని స్వయంగా కేసీఆర్ బహిరంగ సభలోనే ప్రకటించారు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో అదే సామాజిక వర్గం నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా రేసులో ఉన్నందున.. కేసీఆర్ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందేనని పార్టీ నాయకుల విశ్లేషణ.