కృష్ణా జలాల వివాదంతో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్.. ఇరు రాష్ట్రాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాల్సింది పోయి.. సర్దుబాటు చేసుకోకుండా వివాదాన్ని పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతూ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తున్నారని ఆరోపించారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే
కేసీఆర్, జగన్ ఇద్దరూ రాజకీయ ప్రయోజనాల కోసమే జలరగడను పెద్దది చేస్తున్నారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఓ వైపు ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడి కష్టాలు పడుతుంటే.. ఆ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు జల వివాదాన్ని వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇదంతా ఓ సమస్య అయితే తిరుపతిలో తెలంగాణ భక్తులు దర్శనానికి అనుమతి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రం నుంచి అయినా ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలతో వెళ్తే.. తిరుపతిలో దైవదర్శనానికి ఆయా భక్తులకు వసతి కల్పించే వెసులుబాటు ఉందని ఎమ్మెల్యే అన్నారు. కానీ ఈ మధ్య తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలకు అనుమతి లేదని తిరుమల జేఈవో చెప్పారని.. ఇది సరికాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ భక్తులు తిరుమలకు రావొద్దా అని ప్రశ్నించారు.