తెలంగాణ

telangana

ETV Bharat / state

Upadi Hami: ఉపాధి హామీ పథకం అమలులో నిధుల దుర్వినియోగం

రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలులో నిధుల దుర్వినియోగం జరుగుతున్నట్లు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న తనిఖీల్లో వెల్లడవుతోంది. అయినప్పటికీ నిధుల రికవరీ మాత్రం 2 శాతానికి మించకపోవడం గమనార్హం.

misuse-of-funds-in-the-implementation-of-the-national-rural-employment-guarantee-scheme
ఉపాధి హామీ పథకం అమలులో నిధుల దుర్వినియోగం

By

Published : Jul 3, 2021, 7:19 AM IST

రాష్ట్రంలో ఉపాధిహామీ పథకం అమల్లో నిధుల దుర్వినియోగం, అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. ఏటా చేపడుతున్న పనుల్లో కనీసం 10 శాతానికిపైగా నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్నాయి. క్షేత్రస్థాయిలో పనిచేయకున్నా చేసినట్లు చూపడం, చేపట్టాల్సిన పనుల్లో మార్పులు, ఉపాధి కూలీలకు వేతనాల చెల్లింపు, పరిమితికి మించి ఇతర ఖర్చులు చేస్తున్న ఫిర్యాదులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఏటా జరుగుతున్న ఉపాధి పనుల్లో వందల కోట్ల రూపాయలు ఈ తరహా దుర్వినియోగమవుతున్నట్లు ఉపాధిహామీ సామాజిక తనిఖీల్లో వెల్లడవుతోంది. ఆర్థిక లోటుపాట్లు ఉన్నట్లు క్షేత్రస్థాయి అధికారులు అంగీకరిస్తున్నా రికవరీ అవుతున్న నిధులు 2 శాతం కూడా దాటడం లేదు. ఉపాధి హామీ పథకం కింద తెలంగాణలో 33.04 లక్షల కుటుంబాల్లోని 58.76 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ఇటీవల రాష్ట్రంలో ఉపాధి కూలీలకు ఇచ్చే రోజువారీ వేతనాన్ని రూ.237 నుంచి రూ.245కు పెంచారు.

ఏటా రాష్ట్రంలో ఉపాధి హామీ కింద రూ.1200 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేస్తుండగా గతేడాది కరోనా నేపథ్యంలో రూ.1550 కోట్లు ఖర్చుచేశారు. క్షేత్రస్థాయిలో నిధుల వినియోగంలో పలు లోటుపాట్లు జరుగుతున్నాయి. సామాజిక తనిఖీల్లో వెలుగుచూసిన లోపాలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సిబ్బందిపై చర్యలతో పాటు జరిమానాలు విధిస్తున్నారు. 2018-19లో రాష్ట్రప్రభుత్వం నిర్వహించిన సామాజిక తనిఖీల్లో రూ.233.33 కోట్ల ఆర్థిక లోటుపాట్లు జరిగినట్లు వెల్లడైంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన తనిఖీల్లో రూ.47.53 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగినట్లు గుర్తించింది. ఇందులో 62.38 లక్షలు మాత్రమే రికవరీ అయ్యాయి. 2019-20 ఏడాదిలో రూ.37.13 కోట్లు దుర్వినియోగమవగా అందులో ఇప్పటికి రూ.67.68 లక్షలే తిరిగివచ్చాయి. మిగతా నిధుల రికవరీ, కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఉపాధిహామీ పనుల్లో జరుగుతున్న అక్రమాలపై క్షేత్రస్థాయిలో ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నా సకాలంలో చర్యలు తీసుకోవడం లేదు. 2020-21లో ఉపాధి పనులపై 5688 ఫిర్యాదులు రాగా 1820 ఫిర్యాదులే పరిష్కారమవడం అధికారుల పనితీరుకు నిదర్శనం.

ఇదీ చూడండి:ఎగ్జిబిషన్ సొసైటీలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదు: అనిశా డీఎస్పీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details