Mission Bhageeratha: వేసవిలో ఏ ఒక్క గ్రామంలోనూ నీటి ఎద్దడి రావద్దని ఇంజినీర్లకు మిషన్ భగీరథ శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ సూచించారు. అధికారులు ప్రతి గ్రామానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. జలాశయాల్లో నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని తెలిపారు. ప్రజలకు నీటిని పొదుపుగా వాడేలా అవగాహన కల్పించాలన్నారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై అన్ని జిల్లాల ఎస్ఈలు, ఈఈలతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. నీటి నాణ్యత, పరిమాణం విషయంలో అసలు రాజీపడొద్దని స్పష్టం చేశారు.
వేసవిలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఇంజినీర్లను స్మితా సబర్వాల్ ఆదేశించారు. వేసవిలో నాలుగు నుంచి ఐదు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరుగుతాయన్న హెచ్చరికల నేపథ్యంలో తాగునీటి సరఫరాలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు తాగునీటి కష్టాలు ఉండరాదన్న ప్రభుత్వ సంకల్పాన్ని చిత్తశుద్ధితో కొనసాగించాలని తెలిపారు. గ్రామపంచాయతీల అభిప్రాయాలు తీసుకుంటూ నీటి సరఫరా చేయాలని చెప్పారు. పైపు లీకేజీలు అరికట్టి నీటి వృథా కాకుండా చూడాలని అధికారులకు సూచించారు.