సమైక్య రాష్ట్రంలో మత్య్సకారులు ఉన్నారనే విషయాన్నే మర్చిపోయారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రి ప్రశంసించారు. కుంటలు, చెరువులు, రిజర్వాయర్లలో చేపల పెంపకం చేపట్టామని సభకు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు.
రాష్ట్ర ఏర్పాటు ఆరంభంలో చేపల పెంపకానికి 598 చెరువులే అనువుగా ఉండగా.. 7కోట్ల 78 లక్షలు ఖర్చు చేశామన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 23వేల 263 చెరువుల్లో చేపల పెంపకం చేపట్టామని.. 77 కోట్ల 47 లక్షలు ఖర్చు చేస్తున్నామని మంత్రి తెలిపారు. మత్య్సరంగంపై ప్రత్యక్షంగా 37 లక్షల మంది, పరోక్షంగా లక్షలాది కుటుంబాలకు ఉపాధి లభిస్తోందన్నారు. లోయర్ మానేరు వద్ద మార్కెట్ ఏర్పాటు చేస్తామని.. ముంపుగ్రామాల వారికి చేపలు పట్టుకునే అవకాశం కల్పిస్తామని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు.