రాజేంద్రనగర్‌లో 240 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న మెగా డెయిరీ నిర్మాణంలో అత్యాధునిక మెషినరీ ఉపయోగించనున్నట్లు పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. అత్యాధునిక మెషినరీ కోసం ఇతర రాష్ట్రాల్లో అవసరమైన అధ్యయనం చేయాలని సూచించారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ పశుసంవర్ధక శాఖ సమావేశ మందిరంలో ఆ శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, విజయ డెయిరీ ఎండీ శ్రీనివాసరావు, పశుసంవర్ధక శాఖ సంచాలకులు లక్ష్మారెడ్డితో కలిసి లాక్డౌన్ నేపథ్యంలో పాలు, పాల ఉత్పత్తుల తయారీ, సరఫరా తదితర అంశాలపై సమీక్షించారు. కరోనా నేపథ్యంలో పాల సరఫరా, సేకరణలో అధికారులు, సిబ్బంది తగు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. గ్రామాల నుంచి పాలు తీసుకొచ్చే వాహనాలు, పాలు, పాల ఉత్పత్తులు రవాణా చేసే వాహనాలకు ఎక్కడ కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు.
విస్తృత ప్రచారం
పాల ఉత్పత్తుల తయారీ వద్ద తప్పనిసరిగా సిబ్బంది గ్లౌజులు, మాస్కులు ధరించడంతోపాటు వాహనాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని ఆదేశించారు. డెయిరీ పాలి టెక్నిక్ కళాశాల ఏర్పాటుకు కూడా అవసరమైన చర్యలను తీసుకోవాలని సూచించారు. రానున్న 2 ఏళ్లల్లో విజయ ఉత్పత్తులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పారు. ప్రస్తుతం పాడి రైతులకు ఇస్తున్న 4 రూపాయల ప్రోత్సాహం విజయ డెయిరీ చెల్లించే స్థాయికి అభివృద్ధిని సాధించాలని ఆకాంక్షించారు. ప్రత్యేక అధికారులను నియమించిన తర్వాత సుమారు 35 వేల లీటర్ల పాల సేకరణ పెరిగిందని అన్నారు. పాల సేకరణ కేంద్రాల వద్ద తప్పని సరిగా పాల నాణ్యత పరిశీలించే ఎనలైజర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.