మరోసారి మేయర్ పీఠాన్ని తెరాస కైవసం చేసుకోవడం ఖాయమని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎటువంటి కష్టం వచ్చినా అక్కున చేర్చుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు అండగా ఉండటానికి నగర ప్రజలు సిద్ధంగా ఉంటారన్న నమ్మకం తనకు ఉందన్నారు. బల్దియా ఎన్నికల సందర్భంగా తలసాని ‘ఈనాడు-ఈటీవీ భారత్’కు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో వివిధ అంశాలను వెల్లడించారు.
ప్రశ్న: నగరాభివృద్ధికి అయిదేళ్ల క్రితం మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చారా?
జవాబు:నూటికి నూరు శాతం నెరవేర్చాం. రూ.67 వేల కోట్ల విలువైన పనులను మొదలుపెట్టి 50 శాతానికి పైగా పూర్తి చేశాం. దీనివల్లే ట్రాఫిక్ ఇబ్బందులు తీరాయి. గచ్చిబౌలి, ఎల్బీనగర్, కూకట్‌పల్లి ఇలా అనేక కూడళ్లలో ఆకాశమార్గాలను నిర్మించాం. రోడ్డు ప్రమాదాలూ తగ్గాయి. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా చేయాలని సీఎం కేసీఆర్ తలపెట్టారు. మరిన్ని అభివృద్ధి పనులకు ప్రణాళిక సిద్ధంగా ఉంది. బల్దియా పీఠంపై తెరాస కూర్చుంటేనే పూర్తి చేసేందుకు అవకాశం ఉంది. భాజపా, కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే ఇవన్నీ సాధ్యం కాదు. నగర ఓటర్లంతా ఆలోచించి హక్కును వినియోగించుకోవాలి.
ప్రశ్న: సర్కారు హామీ ఇచ్చినట్లుగా పేదలకు వైద్యపరంగా తోడ్పాటు?
జవాబు:పేదల బస్తీల్లో 175 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశాం. వారు ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండానే వీటిలో వైద్య పరీక్షలతోపాటు అన్ని రకాల చికిత్సలు పొందేలా చూశాం. గాంధీ ఆసుపత్రిలో సౌకర్యాలను మెరుగుపర్చాం. ఉస్మానియాకు కొత్త భవనాన్ని నిర్మించాలని తలపెట్టాం. గచ్చిబౌలిలో టిమ్స్‌ను ఏర్పాటుచేసి పేదల దవాఖానాగా తీర్చిదిద్దాం. రాజధానిలో వైద్యపరంగా ఉన్న మౌలిక వసతుల వల్ల దేశంలోని అనేక నగరాలవారు ఇక్కడికి వచ్చి సేవలు పొందుతున్నారు.
ప్రశ్న: ఈ ఎన్నికల్లో మీకే ఎందుకు ఓటు వేయాలి?
జవాబు:గత వందేళ్లలో సమాధానం దొరకని అనేక సమస్యలకు మోక్షం లభించింది. నగర ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ముఖ్యమంత్రి స్పందించి అక్కున చేర్చుకున్నారు. మరో పార్టీ అధికారంలో ఉంటే ఇది జరిగే అవకాశమే లేదు. భాజపా నేతలు ఈ అయిదేళ్లలో హైదరాబాద్ అభివృద్ధికి రూ.500 కోట్లను కూడా సహాయం చేయించలేదు. వరదల వల్ల నగరం ఇబ్బందిపడితే రెండు నివేదికలు పంపించినా కేంద్రం పైసా ఇవ్వలేదు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి, సంక్షేమ ప్రభుత్వానికే ఓటేయమని నగర ప్రజలను మేము అడుగుతాం.
ప్రశ్న: నగరాన్ని ముంపు నుంచి రక్షించడానికి తీసుకునే చర్యలు?
జవాబు: నాలాలు, చెరువులు ఆక్రమించడమే ముంపు సమస్యకు కారణం. ఆక్రమణలకు గత ప్రభుత్వాలు ప్రోత్సహించడం శాపంగా మారింది. చెరువుల కింద ఉన్న ఎఫ్‌టీఎల్‌లోనూ వేలాది ఇళ్లు వచ్చాయి. గొలుసుకట్టు నాలాలు కబ్జాలో ఉన్నాయి. ఇటీవల వరదలూ ఇందువల్లే వచ్చాయి. మంత్రి కేటీఆర్ కార్యాచరణ ప్రకటించారు. కబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతున్నాం. నాలాలపై ఆక్రమణలు తొలగిస్తాం. ఏడాదిలో దీనికో పరిష్కారం చూపిస్తాం. 6 లక్షల మంది బాధితులకు నగదు సాయానికి సీఎం అంగీకరించారు. మీ సేవలో దరఖాస్తు చేసుకున్న వెంటనేే రూ.10వేల చొప్పున వారి ఖాతాలకు నగదు పంపించాం.
ప్రశ్న: పేదలు కోరుకున్న రీతిలో ఇళ్ల నిర్మాణం జరిగిందా?
జవాబు: మహానగర పరిధిలో లక్ష రెండు పడకల ఇళ్లను రూ.12 వేల కోట్ల వ్యయంతో నిర్మించాం. ఇవన్నీ చివరి దశలో ఉన్నాయి. కొన్నింటిని ఇప్పటికే మంత్రి కేటీఆర్ లబ్ధిదారులకు అందజేశారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ఇందిరమ్మ ఇళ్లకు, వీటికి నాణ్యత, సౌకర్యాల విషయంలో ఎంతో తేడా ఉంది. పేదల ఆత్మ గౌరవానికి ప్రతీక మేం నిర్మించిన ఇళ్లు. ఎన్నికలైన కొద్ది రోజుల్లోనే లక్ష ఇళ్లను పేదలకు అందజేస్తాం. వారందరికీ అన్ని రకాల తోడ్పాటును అందిస్తాం.
ప్రశ్న: సంక్షేమ పథకాలు పేదల గూటికి చేరాయా?
జవాబు:కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్ ఇలా ఒకటేమిటి గత అయిదేళ్లలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశాం. వీటితో పేదలకు తోడ్పాటు లభించింది.