ప్రపంచానికి మన దేశం అందించిన గొప్పవరం యోగా అని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి ఎనలేని కృషి చేసిన సిద్ధాంత కర్త ఆచార్య జయశంకర్ అని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం, తెలంగాణ సిద్ధాంత కర్త ఆచార్య వర్ధంతి సందర్భంగా మంత్రి హైదరాబాద్‌లో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
యోగాసనాలు
కొండాపూర్‌లోని కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా సీఐఐ ఛైర్మన్ సమీర్ గోయల్‌తో కలసి మంత్రి యోగాసనాలు వేశారు. నిత్యజీవితంలో యోగ ప్రాముఖ్యత గురించి వెల్లడించారు. ప్రపంచానికి మన దేశం అందించిన గొప్ప వరం యోగా అని కొనియాడారు. యోగాను అందరూ ఆచరించి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని మంత్రి సూచించారు. అనంతరం సీఐఐ ప్రాంగణంలో మొక్కను నాటారు.
ఆచార్య జయశంకర్ స్మరణలో
రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయ శంకర్ వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్.. జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణకు ఆచార్య జయశంకర్ సేవలను మంత్రి స్మరించుకున్నారు.
'ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల్లో పాల్గొని అలుపెరుగని పోరాటం చేసిన తొలి, మలితరం నాయకుడు ఆచార్య జయశంకర్. తెలంగాణ భావజాల వ్యాప్తికి ఎనలేని కృషి చేసిన సిద్ధాంత కర్త. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో జయశంకర్ ఆశయాలను కొనసాగిస్తున్నాం. వ్యవసాయ యూనివర్సిటీకి, భూపాలపల్లి జిల్లాకు ఆచార్య పేరు పెట్టి గౌరవించుకుంటున్నాం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రానికి చెందిన వైతాళికులు, మహానుభావులు, కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, సామాజిక వేత్తల జయంతి, వర్ధంతిలను ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహించడం ఎంతో గర్వంగా ఉంది.'
-శ్రీనివాస్ గౌడ్- క్రీడా, పర్యాటక శాఖ మంత్రి