ఐటీడీఏ పరిధిలో చేపడుతోన్న పనులను ఉపాధిహామీ పథకానికి అనుసంధానం చేస్తూ గిరిజనులకు ఎక్కువగా ఉపాధి కల్పిస్తూ అభివృద్ధి, సంక్షేమ పనులు వేగంగా చేయాలని గిరిజన సంక్షేమశాఖా మంత్రి సత్యవతి రాఠోడ్ ఆదేశించారు. రహదార్లు, గురుకులాలు, కిచెన్ షెడ్స్, ఇతర నిర్మాణ పనులను ఉపాధిహామీతో అనుసంధానించే విషయమై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గిరిజన సంక్షేమ శాఖలోనూ ఉపాధిహామీ పథకం కింద పనులు చేపట్టి, వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. ఐటీడీఏలలో దాదాపు 1855 కోట్ల రూపాయలతో వివిధ రకాల పనులు గుర్తించామని అధికారులు చెప్పారు. రాష్ట్రంలో 2087 గిరిజన గ్రామాలు ఇంకా రహదారి లేకుండా ఉండడం విచారకరమన్న మంత్రి... లాక్డౌన్ సమయంలో తండాలు, చెంచు పెంటలకు రోడ్డు లేకపోవడం వల్ల గిరిజన మహిళలు ఇబ్బంది పడిన సందర్భాలను మంత్రి గుర్తుచేశారు. అంగన్వాడీ సిబ్బంది వారి వ్యక్తిగత వాహనాల్లో వెళ్లి వారికి సాయం చేయాల్సిన పరిస్థితి నెలకొందని, ఇకపై అలాంటి పరిస్థితులు ఉండొద్దని స్పష్టం చేశారు.
నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి..
గిరిజన గూడేలు, చెంచు పెంటల్లోని మహిళల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ విభాగాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న మంత్రి... గిరిజన ప్రాంతాల్లోని పనులన్నీ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పూర్తిచేయాలని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లోని రైతులకు కల్లాల నిర్మాణంపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాలని తెలిపారు. ఉపాధి హామీని సద్వినియోగం చేసుకొని గిరిజన ప్రాంతాల్లోని నిర్మాణ పనులు వేగంగా పూర్తిచేయాలని, తద్వారా గిరిజనులకు పెద్దఎత్తున ఉపాధి కల్పించాలని సత్యవతి రాఠోడ్ ఆదేశించారు.