తెలంగాణ

telangana

ETV Bharat / state

కేటీఆర్ సమయమిస్తే ఏపీ చూపెడతా: రోజా - minister roja met cm kcr after took responsibilities as ap minister

Minister Roja meets CM KCR: కేటీఆర్ ఆంధ్రప్రదేశ్​కు వస్తే అక్కడ జరుగుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను కళ్లారా చూపిస్తామని ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. సీఎం జగన్ నేతృత్వంలో కుల, మతాలు, పార్టీలకు అతీతంగా పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. ఏపీలో కరెంటు కోతలు, నీళ్ల కొరత, రోడ్ల సమస్యపై కేటీఆర్​ వ్యాఖ్యల పట్ల రోజా స్పందించారు. ఏపీ మంత్రిగా రోజా పదవీ బాధ్యతలు స్వీకరించాక.. తొలిసారిగా ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్​తో సమావేశమయ్యారు. కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నట్లు తెలిపారు.

Roja meets KCR
సీఎం కేసీఆర్​తో ఏపీ మంత్రి రోజా భేటీ

By

Published : Apr 29, 2022, 5:44 PM IST

Updated : Apr 29, 2022, 6:51 PM IST

Minister Roja meets CM KCR: ఆంధ్రప్రదేశ్​ గురించి మంత్రి కేటీఆర్​ ఎక్కడా మాట్లాడలేదని ఆ రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా అన్నారు. పొరుగు రాష్ట్రాలు అని ప్రస్తావించారే కానీ.. ఏపీ ప్రస్తావన ఎక్కడే తీసుకురాలేదని చెప్పారు. ఒకవేళ ఏపీ గురించే కేటీఆర్​ మాట్లాడి ఉంటే ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్​ మంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించాక మొదటిసారిగా ఆర్కే రోజా.. కుటుంబసమేతంగా ప్రగతిభవన్‌కు వచ్చారు. మంత్రి పదవిలో కేసీఆర్​ను మర్యాదపూర్వకంగా కలిసిన రోజా.. సీఎంతో పలు అంశాలపై చర్చించారు. ఏపీ నూతన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజాను.. కేసీఆర్ శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్​ చిత్రపటాన్ని సీఎంకు రోజా బహుకరించారు.

రోజాకు తిలకం దిద్దుతున్న ఎమ్మెల్సీ కవిత

దేశంలోనే లేదు:కేసీఆర్​తో సమావేశం అనంతరం బయటకు వచ్చిన రోజా.. మీడియాతో మాట్లాడారు. ఏపీ గురించి కేటీఆర్​ వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. క్రెడాయ్​ ప్రాపర్టీ షోలో ఏపీ గురించి కేటీఆర్​ గురించి మాట్లాడి ఉంటే ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఏపీలో అమలవుతున్న అభివృద్ధి దేశంలోనే ఎక్కడైనా ఉందా అని రోజా ప్రశ్నించారు. ఏపీ పథకాలు, విప్లవాత్మక మార్పులను పక్క రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నారని మంత్రి అన్నారు.

"యంగ్​ అండ్​ డైనమిక్​ లీడర్​ కేటీఆర్​ను సాదరంగా ఆంధ్రప్రదేశ్​కు ఆహ్వానిస్తున్నాను. ఏపీలో నాడు- నేడు కింద పాఠశాలలు, ఆస్పత్రులు ఎలా చేశామో చూపిస్తాను. గ్రామ సచివాలయాలను కేటీఆర్​కు చూపిస్తాను. ఏపీని చూసి తమిళనాడులో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు. కేటీఆర్ తేదీ, సమయం ఇస్తే పర్యాటకశాఖ మంత్రిగా ఏపీ మొత్తం తిప్పి చూపిస్తాను. కేటీఆర్​ను తప్పుదోవ పట్టించారని అర్థమవుతుంది. జగన్ దేశానికే ఆదర్శంగా ఎలా పనిచేస్తున్నారో, అవినీతికి తావులేకుండా ఎలా లబ్ధిదారులకు అందిస్తున్నారో తెలియజేస్తాను." -ఆర్కే రోజా, ఏపీ పర్యాటక, క్రీడలు, యువజన శాఖల మంత్రి

మనోభావాలు దెబ్బతింటాయి: ఇక విద్యుత్​ కోతల విషయానికొస్తే.. తెలంగాణ సహా 16 రాష్ట్రాల్లో కోతలున్నాయని మంత్రి రోజా అన్నారు. వరదల్లో రోడ్లు దెబ్బతిన్నాయని.. ఇప్పుడు వేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ఎవరో చెప్పిన వాళ్ల మాటలు విని మాట్లాడితే ఆంధ్రా వాళ్ల మనోభావాలు దెబ్బతింటాయని వెల్లడించారు. సీఎం కేసీఆర్​ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు పేర్కొన్న రోజా.. మంత్రి అయ్యాక కుటుంబసభ్యులతో కలిసి ప్రగతిభవన్​కు రావాలని కేసీఆర్ ఆహ్వానించినట్లు తెలిపారు.

మంత్రిగా రోజా బాధ్యతలు చేపట్టకముందు.. ఈ నెల 1 న యాదాద్రిని సందర్శించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ముడుపు కట్టారు. పునర్నిర్మాణం తర్వాత యాదాద్రి వైభవాన్ని చూసి ఆమె తన్మయత్వం పొందారు. ఆలయ ప్రాభవాన్ని చూసేందుకు రెండు కళ్లు సరిపోవని.. యాదాద్రి పునర్నిర్మాణానికి కృషి చేసిన సీఎం కేసీఆర్​పై ప్రశంసల జల్లు కురిపించారు. తిరుమలతో సమానంగా యాదగిరిగుట్టను పునర్నిర్మించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 13న రోజా.. ఆంధ్రప్రదేశ్​ పర్యాటక, క్రీడలు, యువజన శాఖల మంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించారు.

కేటీఆర్ ఎక్కడా ఏపీ గురించి మాట్లాడలేదు.. ఎవరో తప్పుదోవ పట్టించారు: రోజా

ఇవీ చదవండి:'భాజపా కార్యకర్తలు చిల్లరగా వ్యవహరించారు... నితిన్​ గడ్కరీ సారీ చెప్పారు'

పెళ్లి కోసం పిల్లను ఇవ్వమని ఇలా కూడా అడుగుతారా?

Last Updated : Apr 29, 2022, 6:51 PM IST

ABOUT THE AUTHOR

...view details