సాగు నీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో వాడీవేడీ చర్చ జరిగింది. తెరాసకు పేరు రావటం కోసం కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టుల పేర్లు మార్చారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆక్షేపించారు. ప్రాణహిత-చేవేళ్ల, సీతారామ ప్రాజెక్టులను ఉదాహరణగా చెప్పారు.
ఈ క్రమంలో కలుగజేసుకున్న మంత్రి పువ్వాడ అజయ్... మెుబిలైజ్ అడ్వాన్సులతో దోచుకున్న చరిత్ర కాంగ్రెస్‌దని విమర్శించారు. 70 ఏళ్లలో ఖమ్మం జిల్లాకు చుక్క నీరివ్వలేదన్నారు. మంత్రి వ్యాఖ్యలను భట్టి విక్రమార్క ఖండించారు. రీడిజైన్ పేరుతో అంచనా వ్యయం వేలకోట్లకు పెంచారని ఆరోపించారు.
మంత్రిపై రాజగోపాల్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
ఈ క్రమంలో మంత్రి తలసానిపై అసభ్య పదజాలం ఉపయోగించారని తెరాస సభ్యులు రాజగోపాల్ రెడ్డిపై మండిపడ్డారు. రాజగోపాల్‌రెడ్డిని మంత్రి తలసాని కాంట్రాక్టర్ అని సంభోదించడతో.. గొడవ మొదలైంది. దీంతో రాజగోపాల్‌రెడ్డి తలసానిపై విరుచుకుపడ్డారు. రాజగోపాల్‌రెడ్డి సభకు క్షమాపణ చెప్పాలని తెరాస శాసనసభ్యులందరూ డిమాండ్ చేశారు.
తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్న ఎమ్మెల్యే
రాజగోపాల్‌రెడ్డి మాట్లాడిన మాటాలను రికార్డుల నుంచి తొలగించడం జరిగిందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ తెలిపారు. రాజగోపాల్‌రెడ్డి అసెంబ్లీకి క్షమాపణ చెప్పాలని కోరారు. క్షమాపణ చెబితేనే... అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పిస్తామని స్పీకర్ అన్నారు. ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. అయితే తన మాటాలను వెనక్కి తీసుకుంటానని రాజగోపాల్ రెడ్డి సభలో చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.