Satyavathi rathod fire on Bjp: ఎనిమిదేళ్లలో గిరిజనుల కోసం ఎవరు కృషి చేశారో ప్రజలు ఆలోచించుకోవాలని మంత్రి సత్యవతి రాఠోడ్ వ్యాఖ్యానించారు. చిత్తశుద్ధి ఉంటే ఐదేళ్లుగా తమ తీర్మానం ఎందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు. గిరిజన రిజర్వేషన్ల పట్ల భాజపా నేతలు మోసపూరిత హామీలు ఇస్తున్నారని ఆరోపించారు. వారం రోజుల్లోగా రాష్ట్రంలో రిజర్వేషన్ల అమలు జీవో వస్తుందని ఆమె తెలిపారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఎంతోమందికి మేలు చేస్తుందన్నారు.
గిరిజనులపై నిజంగా భాజపా నేతలకు ప్రేమ ఉంటే ఆనాటి విభజన హామీలు ఎందుకు పక్కన పెట్టారని ధ్వజమెత్తారు. గిరిజనులకు ఎన్నో ఉపాధి అవకాశాలు తెచ్చిపెట్టే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మగారం, గిరిజన విశ్వవిద్యాలయం ఎందుకు మరిచారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ల పెంపునకు సహకరించాలని ఆమె డిమాండ్ చేశారు.