Minister Niranjan reddy on rythu bandhu: రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద నగదు సాయం కొనసాగుతోందని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు 62 లక్షల 99 వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 7వేల 411.52 కోట్ల రూపాయలు జమయ్యాయని అధికారులు వెల్లడించారు. కోటి 48 లక్షల 23 వేల ఎకరాలకు రైతుబంధు నిధులు జమ అయ్యాయి.
అత్యధికంగా నల్గొండ జిల్లాలో 4లక్షల 69వేల696 మంది రైతుల ఖాతాల్లో 601 కోట్ల 74 లక్షల 12వేల 80 రూపాయలు జమ అయ్యాయి. అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 33 వేల452 మంది రైతులకు 33కోట్ల 65 కోట్ల రూపాయలు చేరాయి. రైతుబంధు అమలు ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి దిక్సూచిలా నిలిచారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రశంసించారు. వ్యవసాయ రంగం పట్ల కేంద్ర ప్రభుత్వం జాతీయ విధానం అవలంభించాలని సూచించారు.
ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయా రాష్ట్రాలు, ప్రాంతాలకు అనుగుణంగా మద్దతు ధర నిర్ణయించాలన్న మంత్రి నిరంజన్‌రెడ్డి.. కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని... మద్దతు ధర ప్రకటించి కేంద్రం చేతులు దులుపుకోవడం శోచనీయమని మంత్రి మండిపడ్డారు. దశాబ్దాలుగా పాలకులంతా రైతులను ఓటు బ్యాంకులుగానే చూశారని..CM-KCR మాత్రం చేయూతను అందిస్తూ ముందుకు నడిపిస్తున్నారని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.