తెలంగాణ

telangana

ETV Bharat / state

'జాతీయ పార్టీగా కాంగ్రెస్​ పోషించిన పాత్ర ఏమిటి?' - మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి

Minister Niranjan Reddy fire on Congress Party: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాంగ్రెస్​ పార్టీపై ఎదురుదాడికి దిగారు. జాతీయ పార్టీగా కాంగ్రెస్​ విఫలమయిందని అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో నిర్మాణాత్మక పాత్ర ఎన్నడూ పోషించలేదని.. కేవలం ఓట్ల కోసమే పాలమూరు ప్రాజెక్టుల గురించి కేసీఆర్​ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.

Singireddy Niranjan Reddy
వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి

By

Published : Jan 23, 2023, 8:22 PM IST

Singireddy Niranjan Reddy fire on Congress Party: కాంగ్రెస్​ పార్టీపై వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రంలో అధికారంపై కాంగ్రెస్ పార్టీవి పగటికలలు అని మంత్రి అన్నారు. పాలమూరు ఎత్తిపోతల జాప్యానికి కారణం కాంగ్రెస్​నని చెప్పారు. ఆ పార్టీ నాయకులు కేసులు వేసి అడ్డంకులు సృష్టించకుంటే ఈ పాటికే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తయ్యేవని తెలిపారు. ఇప్పటికి సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయని స్పష్టం చేశారు.

బిజినేపల్లి దళిత, గిరిజన ఆత్మగౌరవ సభలో కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణను ఆంధ్రలో కలిపి ఎడారి చేసినందుకు కాంగ్రెస్‌ను గెలిపించాలా? కలిపిన తెలంగాణను తిరిగి సాధించుకునేందుకు వేల మంది బలి దానాలకు కారణమైనందుకు కాంగ్రెస్‌ను గెలిపించాలా? అని విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో లక్ష ఎకరాలకు సాగు నీళ్లు లేవని అన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ నాయకత్వంలో నేడు 11 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని గుర్తు చేశారు.

రేపు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తైతే రెండేళ్లలో 23, 24 లక్షల ఎకరాలకు సాగు నీరందుతున్న నిజం ప్రజల కళ్ల ముందు కనిపిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పుణ్యాన 30, 40 వేల రూపాయలకు ఎకరా చొప్పున భూమి రైతులు అమ్ముకున్నారని, నేడు ఎక్కడ చూసినా 20 లక్షల పైమాటేనని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 13 లక్షల మంది రైతులు రైతుబంధు పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని, దాదాపు 4 లక్షల మందికి ఆసరా ఫించన్లు అందుతున్నాయని అన్నారు. కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, న్యూట్రిషన్ కిట్, అమ్మ ఒడి పథకాల అమలు ద్వారా సామాన్యమైన ప్రజలు సంతృప్తిగా ఉన్నారని స్పష్టం చేశారు.

చేతులు కట్టుకొని కూర్చున్నారు: తెలంగాణ సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి. ప్రజలు అవి ప్రత్యక్ష్యంగా చూస్తున్నారని, ఇవన్నీ గమనిస్తున్న ప్రజలు కోరి కొరివి దయ్యం లాంటి కాంగ్రెస్​కి ఆదరిస్తారా? అని ధ్వజమెత్తారు. జాతీయపార్టీగా కాంగ్రెస్ పార్టీ విఫలమైందని, ప్రతిపక్ష పాత్రలో వైఫల్యమే నేటి బీజేపీ నియంతృత్వానికి కారణం అని ఆరోపించారు. సరైన సమయంలో భాజపా విధానాలపై పోరాడకుండా చేతులు కట్టుకుని కూర్చొన్నారని ఎద్దేవా చేశారు.

గుజరాత్‌లో ఎన్నికలు జరుగుతుంటే ప్రచారానికి వెళ్లని రాహుల్ గాంధీ భాజపాను ఎలా ఓడిస్తారు? అని సూటిగా ప్రశ్నించారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను భాజపా టోకున అమ్మేస్తుంటే కాంగ్రెస్ నోరు మెదపడం లేదని, గత ఎనిమిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుంటే ఎక్కడా ప్రశ్నించిన పాపాన పోలేదని ఆక్షేపించారు. కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణతో ధరలు పెరిగి పేద, మధ్య తరగతి కుటుంబాల బతుకులు ఆగమైతుంటే జాతీయ పార్టీగా కాంగ్రెస్ పోషించిన పాత్ర ఏంటి? అని ప్రశ్నించారు.

కేంద్రం, భాజపాపై దేశంలో పోరాడుతున్నది కేసీఆర్ తెచ్చిన తెలంగాణకు తూట్లు పొడవడం, సీఎంపై నిత్యం నిందలు వేయడంలో కాంగ్రెస్ నిమగ్నమై ఉందని ఆరోపించారు. తెలంగాణ వ్యతిరేకులకు ఊతమివ్వడం, తెలంగాణ అభివృద్ధిలో నిర్మాణాత్మక పాత్ర ఎన్నడూ పోషించలేదని అన్నారు. రాష్ట్రంలో గెలుపు సంగతి తర్వాత మొదలు కాంగ్రెస్ ఇంటిపోరు తేల్చుకోవాలని మంత్రి పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details