ఆత్మస్థైర్యం పెరగడం వల్లే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని... వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. అన్నదాతల ఆత్మహత్యలు అతి తక్కువగా నమోదైన రాష్ట్రం తెలంగాణ అంటూ పార్లమెంట్‌లో కేంద్రం వెల్లడించిన గణాంకాలను మంత్రి గుర్తు చేశారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. 2018లో రైతుబంధు పథకం అమలు తర్వాత 2019లో 491కి రైతు ఆత్మహత్యలు తగ్గిపోయాయని.. పార్లమెంటులో కేంద్రం ఈ సమాధానం చెప్పడం వ్యవసాయ రంగంలో ప్రభుత్వ ముందు చూపునకు నిదర్శనమని మంత్రి వివరించారు. రైతుబంధుపై సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ రైతు అనుకూల వ్యవసాయ విధానాలు దేశానికి దిక్సూచిగా నిలిచాయని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
ఆత్మవిమర్శ చేసుకోవాలి
నిపుణుల సలహాలతో 6 నెలలు మేధోమథనం చేసిన సీఎం... రైతుబంధు పథకం ప్రవేశపెట్టారని మంత్రి చెప్పారు. రైతుబంధుపై రాజకీయం చేసే వారు కేంద్రం ఇచ్చిన సమాధానం పరిశీలించి ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయరంగం మాదిరిగానే భవిష్యత్తులో దళితబంధు పథకం ద్వారా దళితులు ఆర్థిక పరిపుష్టి సాధిస్తారని నిరంజన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.