కంటైన్‌మెంట్ జోన్లలో నిబంధనలు పటిష్టంగా అమలు చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఆ ప్రాంతాల్లోని ప్రజలను ఇళ్లకే పరిమితం చేయాలన్న మంత్రి... పాలు, కూరగాయలు, నిత్యావసరాలు, ఔషధాలు ఇళ్లకే సరఫరా చేయాలని సూచించారు. కరోనా కట్టడిలో భాగంగా తీసుకోవాల్సిన చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. కంటైన్‌మెంట్ నిబంధనలు అతిక్రమించిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు పెట్టాలని స్పష్టంచేశారు. శానిటైజేషన్, స్ప్రేయింగ్, ఫీవర్ సర్వే తగు జాగ్రత్తలతో చేయాలని సూచించారు.
హైదరాబాద్ ఆసిఫ్‌నగర్ డివిజన్‌లోని మెహదీపట్నం, మల్లేపల్లి కంటైన్‌మెంట్ జోన్లలో డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటించారు. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌తో కలిసి.. అక్కడి సమస్యలు ఆరా తీశారు. కరోనా కట్టడి కోసమే ప్రభుత్వం కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేసిందని మహేందర్‌రెడ్డి తెలిపారు. ప్రజలంతా సహకరిస్తే వైరస్ బారి నుంచి త్వరగా బయటపడొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. చేవెళ్ల, మొయినాబాద్ ప్రాంతాల్లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పర్యటించారు. ఇతర అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో లాక్‌డౌన్ అమలును పరిశీలించారు. విధి నిర్వాహణలో ఉండే ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తి పెంచుకునే విధంగా పోషకాహారం తీసుకోవాలని సూచించారు. అనవసరంగా బయటకు వచ్చే వారిపై కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.