తెలంగాణ

telangana

ETV Bharat / state

'అప్పుడు ఎగతాళి చేసినోళ్లే.. ఇప్పుడు మెచ్చుకుంటున్నరు' - వ్యక్తిగత జీవితం గురించి పంచుకున్న కేటీఆర్​

సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే రాష్ట్ర ఐటీ, పారిశ్రామిక మంత్రి కేటీఆర్ ట్విట్టర్​లో ప్రజలను పలకరించారు. ఆస్క్​ కేటీఆర్​ హ్యాష్​ట్యాగ్​తో నెటిజన్లు అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు. ఏపీ రాజధాని అంశం, రాష్ట్రంలో నాయకత్వం, పలు అభివృద్ధి పనులు, వ్యక్తిగత ఇబ్బందులు ఇలా అన్ని రకాల అంశాలపై నెటిజన్లు అడిగి ప్రశ్నలకు కేటీఆర్ తనదైన శైలిలో బదులిచ్చారు.

MINISTER KTR TWITTER OVERALL STORY
MINISTER KTR TWITTER OVERALL STORY

By

Published : Dec 29, 2019, 11:39 PM IST

'ఎగతాళి చేసిన నోళ్లే మెచ్చుకోవటం గర్వంగా ఉంది'
ఆవిష్కరణ, మౌలికవసతుల కల్పన, సమ్మిళితవృద్ధి తమ ప్రధాన ఎజెండా అని మంత్రి కేటీఆర్... ట్విట్టర్​లో ప్రజలతో చేసిన చిట్​చాట్​లో స్పష్టం చేశారు. ఆస్క్​కేటీఆర్​ హ్యాష్​ట్యాగ్​తో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు మంత్రి కేటీఆర్​. అభివృద్ధి కార్యక్రమాలకు, నిర్మాణాలకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవని మంత్రి వివరించారు. రాష్ట్ర పర్యటకాన్ని పెంపొందించేందుకు పారిశుద్ధ్య నిర్వహణ, చారిత్రక నిర్మాణాలైన చార్మినార్, గోల్కొండ వంటి వారసత్వ కట్టడాల సంరక్షణ, యూరప్, అమెరికాకు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఎయిర్ లైన్స్ కనెక్టివిటీ వంటి చర్యలతో పెంపొందిస్తామని పేర్కొన్నారు.

నీటి ఇబ్బందులు లేని నగరంగా హైదరాబాద్​...

శాంతియుత నిరసనలకు తాము అడ్డుకోమన్నారు కేటీఆర్​. దేశంలోనే హైదరాబాద్ శాంతియుత నగరమని.. ఆ ఖ్యాతిని కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ నగరానికి భవిష్యత్తులో ఎటువంటి నీటి ఇబ్బందులు లేవని... దేశంలోనే నీటి ఇబ్బందులు లేని నగరంగా హైదరాబాద్ నిలుస్తుందని తెలిపారు. కాళేశ్వరం పూర్తితో నగరానికి మరింత నీటి దన్ను ఏర్పడిందన్నారు. మిడ్ మానేరును సీఎం కేసీఆర్​తో కలిసి రేపు సందర్శిస్తామన్నారు. 2020 మొదటి అర్ధ సంవత్సరంలో టీహబ్ ఫేస్-2 ప్రారంభం కానుందని ప్రకటించారు. ఎయిర్​పోర్టు వరకు మెట్రో విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. ప్రపంచస్థాయి తయారీ సంస్థలను హైదరాబాద్​కు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.

జగన్​ మంచి ప్రారంభాన్నిచ్చారు...

ఏపీలో ఉన్న రెండు ప్రధాన పార్టీల మధ్య వైరుధ్యాలతో విసుగెత్తిపోయామని.. ఏపీలోనూ తెరాస పార్టీని విస్తరించాలని తెలంగాణలా సుస్థిర ప్రభుత్వం బలమైన నాయకత్వం కావాలని ఓ నెటిజన్​ కోరిన కోరికకు.... కేటీఆర్ కృతజ్ఞతలు చెప్పారు. రాష్ట్రావిర్భావం సమయంలో తెలంగాణకు సరైన నాయకత్వం లేదు అన్న నోళ్లే ఇప్పుడు మెచ్చుకుంటున్నారని... ఇదంతా సీఎం కేసీఆర్ నాయకత్వ పటిమ వల్లేనని చెప్పారు. ఏపీకి మూడు రాజధానుల అంశం, రాజధాని, హైకోర్టే అభివృద్ధి కేంద్రాలా అని అడిగిన ప్రశ్నకు... అది ఏపీ ప్రజలు నిర్ణయించుకోవాలని బదులిచ్చారు. ఆరు నెలల జగన్​ పాలనపై స్పందిస్తూ... సీఎంగా మంచి ప్రారంభాన్నిచ్చారని మంత్రి కితాబిచ్చారు.

పార్టీ పదవే నాకు విలువైంది...

రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థను బ్యాలెన్స్ చేయడం అతిపెద్ద సవాల్ అని కేటీఆర్​ అన్నారు. రాజకీయాల్లో సీఎం కేసీఆరే తనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో పార్టీ క్లీన్ స్పీప్ చేయటం 2019లో తనకు గుర్తుండిపోయే జ్ఞాపకమన్నారు. మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రెండు బాధ్యతల్లో ఏది ఫేవరెట్ అన్న ప్రశ్నకు.. పార్టీ వల్లే తనకు ఇంతటి ఖ్యాతి అని.. పార్టీ పదవే విలువైందని జవాబిచ్చారు.

ఇవే కాక, పలు రాష్ట్ర స్థాయి ప్రజల సమస్యలపై వ్యక్తిగతంగా స్పందిస్తూ.. పరిష్కారం దిశగా చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి:అనిశా వలలో ఈసారే ఎక్కువ అవినీతి తిమింగలాలు...!

ABOUT THE AUTHOR

...view details