తెలంగాణ

telangana

ETV Bharat / state

'పొలిటికల్ టూరిస్టులతో ఒరిగేదేం లేదు... మేయర్ పీఠం తెరాసదే'

పొలిటికల్ టూరిస్టులతో హైదరాబాద్ నగరానికి ఒరిగేది ఏమిలేదని తెరాస కార్యానిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఎన్నికలు అనగానే పరిగెత్తుకుని వస్తున్న భాజపా నాయకులు ఆరేళ్లలో రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి ఏంచేశారో చెప్పాలని ప్రశ్నించారు. వరదలు వచ్చినప్పుడు ఏ ఒక్క నాయకుడు హైదరాబాద్ వైపు కన్నెత్తి చూడలేదని జీహెచ్ఎంసీ ఎన్నికలు రాగానే వరదలా వస్తున్నారని ఎద్దేవా చేశారు.

'పొలిటికల్ టూరిస్టులతో ఒరిగేదేం లేదు... మేయర్ పీఠం తెరాసదే'
'పొలిటికల్ టూరిస్టులతో ఒరిగేదేం లేదు... మేయర్ పీఠం తెరాసదే'

By

Published : Nov 26, 2020, 9:52 PM IST

వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ నగర ప్రజలను ఓదార్చడానికి రాని కేంద్రమంత్రులు ఎన్నికలనగానే డజన్ల కొద్దీ వస్తున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. వచ్చేవాళ్లు ఉత్త చేతులతో రాకుండా సీఎం కేసీఆర్ కోరిన వరద సహాయం రూ.1,350 కోట్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేకుంటే తెలంగాణ ప్రజలు భాజపా నాయకులను నిలదీస్తారని స్పష్టం చేశారు. మల్కాజిగిరి, శేరలింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో జరిగిన రోడ్​షోలలో కేటీఆర్ పాల్గొన్నారు.

సింహంలా కేసీఆర్...

వరదల కారణంగా హైదరాబాద్ నగర ప్రజలు తల్లడిల్లుతుంటే భాజపా నాయకులు కనీసం ఇటు వైపు కూడా చూడలేదన్నారు. ఈరోజు గుంపులు గుంపులుగా నగరానికి వచ్చిన నాయకులు హైదరాబాద్ వరద నీటిలో తల్లడిల్లుతున్నపుడు వీళ్లంతా ఎక్కడున్నారన్నారని ప్రశ్నించారు. భాజపా వాళ్లు గుంపులుగా వచ్చినా సీఎం కేసీఆర్ సింహం లాగా సింగిల్​గా వస్తున్నాడని కేటీఆర్ అభివర్ణించారు.

ఉలుకుపలుకులేదు...

గుజరాత్​లో వరదలు వస్తే రూ. 500 కోట్లు, బెంగళూరులో వరదలు వస్తే రూ. 669 కోట్లు హుటాహుటిన ప్రధాని మోదీ వరదసాయం ప్రకటించారన్నారు. హైదరాబాద్ నగరంలో వరదలు వస్తే రూ.1,350 కోట్ల సాహాయం అందించమని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి ఉత్తరం రాస్తే ఉలుకుపలుకు లేదన్నారు.

మీరే నిర్ణయించుకోండి...

జన్​ధన్ ఖాతాలు ప్రజలు తెరిస్తే ప్రతి ఒక్కరి అకౌంట్లో ధన్​ధన్ మంటూ రూ.15 లక్షలు వేస్తామని భాజపా ప్రజలను మోసం చేసిందన్నారు. నగర ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న రూ.10వేలు అడ్డుకున్న భాజపా నాయకులు రూ.25వేలు ఇస్తామంటున్నారంటే ఆలోచించాలన్నారు. కరోనా సందర్భంగా ప్రధాని ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎంతమందికి చేరిందో ప్రజలకు తెలుసన్నారు. గల్లీ పార్టీ కావాలో దిల్లీ పార్టీ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని కేటీఆర్ అన్నారు.

"ఉద్వేగాలు కాదు మన పిల్లలకు కావాల్సినవి ఉద్యోగాలు. అమెజాన్, ఆపిల్, గూగుల్ వంటి కంపెనీలు హైదరాబాద్ నగరానికి వస్తున్నాయంటే నగరంలో ఉన్న సౌకర్యాలు, శాంతి భద్రతలే కారణం. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే నగర అభివృద్ధి దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రజలంతా అలోచించి గ్రేటర్ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టండి"

---- రోడ్​షో లో కేటీఆర్

ఇదీ చూడండి:'లా అండ్ ఆర్డర్ సమస్యలుంటే చర్యలేందుకు తీసుకోవట్లేదు?'

ABOUT THE AUTHOR

...view details