పట్టణ ప్రగతి కార్యక్రమంతో మంచి మార్పునకు బీజం పడిందన్నారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. పట్టణాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడంలో ప్రగతి కార్యక్రమం తొలి అడుగుగా భావిస్తున్నామని మంత్రి తెలిపారు. హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ ఆర్డీలో జిల్లాల అదనపు కలెక్టర్లు, పురపాలక శాఖ అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. పది రోజుల పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలంతా కలిసి కార్యక్రమం విజయవంతం చేసినందుకు మంత్రి ధన్యవాదాలు చెప్పారు.
దీర్ఘకాలిక సమస్యలు
పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణాల్లో దశాబ్దాలుగా పేరుకుపోయిన అనేక దీర్ఘకాలిక సమస్యలను గుర్తించామన్నారు. వీటితోపాటు పారిశుద్ధ్య సమస్యలను వెంటనే పరిష్కరించామన్నారు. గుర్తించిన దీర్ఘకాలిక సమస్యలను భవిష్యత్లో ప్రణాళికబద్దంగా పరిష్కరించేందుకు పనిచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పట్టణాల్లో గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం వార్డు కమిటీలతోపాటు పట్టణ ప్రజలను భాగస్వాములను చేస్తూ.. వారిని నిరంతరం చైతన్య పరుస్తూ ముందుకు పోవాలన్నారు.