హైదరాబాద్ ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఇబ్రహీంపట్నం శాసనసభ్యుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ‘ప్రభుత్వానికి ఔషధనగరి అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు. రూ. 64 వేల కోట్ల పెట్టుబడులు, 5.60 లక్షల మందికి ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్టుకు కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రాధాన్యం పెరిగింది. ఈ ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలను గుర్తించి, వారి కుటుంబ సభ్యుల విద్యార్హతలు, సాంకేతిక అర్హతల ఆధారంగా జాబితాను రూపొందించాలి. వీరికి శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ నైపుణ్య, విజ్ఞాన సంస్థ (టాస్క్) ఇతర సంస్థల సహకారం తీసుకుంటాం. పరిశ్రమల భాగస్వామ్యంతో వారి అవసరాల మేరకు శిక్షణ కార్యక్రమాలు రూపొందిస్తాం. స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించే సంస్థలకు ప్రత్యేక ప్రోత్సాహమిచ్చే విధానాన్ని ఇప్పటికే ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీనికి విశేష స్పందన లభిస్తోంది’ అని వివరించారు.