Ktr Hmda Review: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే చెరువుల సంరక్షణపైన ప్రత్యేకమైన దృష్టి సారించి.. వాటిని అభివృద్ధి చేస్తూ వస్తున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హెచ్ఎండీఏ పరిధిలోని అనేక చెరువులను వేగంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. నానక్రామ్ గూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో హెచ్ఎండీఏ కార్యకలాపాలు, చేపట్టిన ప్రాజెక్టులపైన మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. చెరువుల సంరక్షణకు భవిష్యత్తు కాలంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని కేటీఆర్ అన్నారు.
జీహెచ్ఎంసీతో...
హెచ్ఎండీఏతో పాటు జీహెచ్ఎంసీ అనేక చెరువులను అభివృద్ధి చేస్తుందని.. జీహెచ్ఎంసీతో కలిసి సమన్వయం చేసుకుంటూ ఈ ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. హెచ్ఎండీఏ పరిధిలో గండిపేట వంటి అతిపెద్ద చెరువుల వద్ద ఇప్పటికే అభివృద్ధి, సంరక్షణ కార్యక్రమాలను చేపట్టినట్లు వెల్లడించారు. గండిపేట సుందరీకరణ అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా విస్తృతస్థాయిలో చేపట్టాల్సిన అవసరం ఉందని.. ఇది నగర ప్రజలకు ఒక అద్భుతమైన చోటుగా మారుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.