పురపాలికల్లో ప్రస్తుత సిబ్బందిని హేతుబద్ధీకరించి.. ఆ తర్వాత పట్టణ ప్రజల అవసరాల మేరకు నూతన సిబ్బంది నియామకం చేపట్టనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. మున్సిపాలిటీలో ఖాళీలను భర్తీ చేస్తామని ఇటీవల ప్రకటించిన మంత్రి.. ఖాళీల భర్తీపై సంబంధిత అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించారు.
పట్టణ ప్రాంతాల్లో మార్పు లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోందని, పెరుగుతున్న పట్టణీకరణ, పట్టణాల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని కేటాయిస్తామని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందిని హేతుబద్ధీకరించాక పట్టణ ప్రజల అవసరాల మేరకు నూతన సిబ్బంది నియామకం చేపడతామని అన్నారు. ఇంజినీరింగ్, ఇన్ఫ్రా విభాగాలకు ప్రాధాన్యత ఉంటుందన్న ఆయన.. పరిపాలన వికేంద్రీకరణ స్ఫూర్తి మేరకు ప్రజలకు పాలనా ప్రతిఫలాలు అందాలని స్పష్టం చేశారు.