హుజూరాబాద్ ఉపఎన్నిక (Huzurabad By Election) చాలా చిన్న అంశమని... దానిపై ఎక్కువగా చర్చించాల్సిన అవసరం లేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) అన్నారు. కొంతమందికి హుజూరాబాద్ ఉపఎన్నిక అత్యంత ప్రాధాన్య అంశం కావచ్చు కానీ... తమకు అది ఒక ఉపఎన్నిక మాత్రమేనన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓడితే రాష్ట్రంలో ప్రభుత్వం మారదని... గెలిస్తే కేంద్రంలో తాము అధికారంలోకి రామని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఈటల కంటే ముందే...
నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హుజూరాబాద్ ఉపఎన్నికపై చర్చించి వ్యూహ రచన చేస్తామని కేటీఆర్ అన్నారు. హుజూరాబాద్ ముందు నుంచీ.. తెరాస కంచుకోటేనని... ఉపఎన్నికల్లో కచ్చితంగా తెరాసనే విజయం సాధిస్తుందన్నారు. ఈటల రాజేందర్ తెరాసలో చేరనప్పుడు కూడా కమలాపూర్ నియోజకవర్గంలో తెరాస బలంగా ఉందన్నారు. దళితబంధు పథకం విషయంలో కొందరు కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారని... విపక్షాలకు దమ్ముంటే ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దళితబంధు, బీసీ బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ముందుగా వారికే...
బీసీ బంధు ఇవ్వాలన్న డిమాండ్లపై స్పందించిన కేటీఆర్... అట్టడుగున దళితులు ఉన్నారు కాబట్టి ముందుగా దళితబంధు అమలు చేస్తున్నామని.. ఆ తర్వాత ఎప్పుడు ఏ పథకం అమలు చేయాలో ప్రభుత్వానికి తెలుసన్నారు. ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే హుజూరాబాద్‌లో దళితబంధు పథకంలో భాగస్వాములై దళితుల అభివృద్ధికి సూచనలు ఇవ్వాలన్నారు. హుజూరాబాద్‌లో దళితబంధు విజయవంతమైతే.. దేశమంతా తెలంగాణ వైపు చూస్తుందన్నారు.
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా అభివృద్ధి చెందుతోందని.. కేంద్ర ప్రభుత్వమే చెబుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. దళితబంధు పథకాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో హుజూరాబాద్ ఉపఎన్నికపై చర్చే జరగలేదని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత నిర్మాణంపై కేశవరావు నేతృత్వంలో సమావేశం నిర్వహిస్తామన్నారు.
సార్వత్రిక ఎన్నికలకు రెండున్నరేళ్ల సమయం ఉంది. హుజూరాబాద్ ఎన్నిక అనేది చిన్న అంశం. దానితోని ప్రభుత్వం కూలిపోయేది లేదు. కేంద్రంలో మేం అధికారంలోకి వచ్చేది లేదు. చిన్న ఉపఎన్నిక దాని గురించి ఇంత హైరానా అవసరం లేదు. అది టీఆర్ఎస్ పార్టీ కంచుకోట. 2001లోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు సహా అప్పుట్లోనే టీఆర్ఎస్ గెలిచింది. తర్వాత చాలా మంది నాయకులు చేరారు. 2003లో ఈటల రాజేందర్ చేరారు. తర్వాత ఆయన ఎమ్మెల్యే అయ్యారు. మొదటి నుంచి కమలాపూర్ నియోజకవర్గం ఇప్పుడు హుజూరాబాద్ పార్టీ అండగానే ఉంది. రేపు కూడా అండగానే ఉంటుంది అందులో ఏం అనుమానం అవసరం లేదు. హుజూరాబాద్‌లో అక్కడ ఉన్న 21వేల దళిత కుటుంబాలకు పైలెట్ ప్రాజెక్టుగా చేసుకుని వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే దేశం మొత్తం తెలంగాణవైపు చూస్తుంది.
-- కేటీఆర్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు
'హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలిచినా... ఓడినా ఏం మారదు' ఇదీ చూడండి: KTR: 'తెలంగాణ రాజకీయ క్షేత్రంలో తిరుగులేని విజయాలు తెరాస సొంతం'