KTR on ITIR:హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసినట్లు పార్లమెంట్‌లో కేంద్ర ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన ప్రకటనను మంత్రి కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. కుంచిత రాజకీయాల కోసం ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసిన భాజపా ప్రభుత్వం... ఐటీఐఆర్ స్థాయిలో రాష్ట్రానికి పలు ప్రాజెక్టులను మంజూరు చేశామని పార్లమెంట్‌లో అబద్దాలు చెప్పి దేశ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. భాజపా డీఎన్ఏలో నిండి ఉన్న అసత్యాలు, అవాస్తవాలు, పచ్చి అబద్దాలను ఎప్పటి లాగే... అలవోకగా కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారని కేటీఆర్ విమర్శించారు.
KTR fires on modi:ఆ ఒక్క కారణంతోనే... రాజకీయంగా విభేదిస్తున్నామన్న ఒకే ఒక్క కారణంతో హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసి మోదీ సర్కార్ తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. ఐటీఐఆర్ రద్దుతో హైదరాబాద్ ఐటీ పరిశ్రమ మరింతగా ఎదిగే అవకాశాన్ని కోల్పొయిందన్న కేటీఆర్.... ప్రస్తుతం ప్రగతికి కేంద్రం చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే తెలంగాణకు శనిలా దాపురించిన మోదీ ప్రభుత్వం ఎన్నో ప్రాజెక్టులు, విభజన హమీల తరహాలోనే ఐటీఐఆర్‌ను కూడా మూలకు పెట్టిందని ఆక్షేపించారు.
50 సార్లు కేంద్రానికి విజ్ఞప్తి.. ముఖ్యమంత్రి కేసీఆర్, తాను వివిధ సందర్భాల్లో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను ఐటీఐఆర్ గురించి ఎన్నోసార్లు కోరినప్పటికీ ఈ కేంద్ర ప్రభుత్వంలో చలనం రాలేదని ఆరోపించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుకు సమానస్థాయిలో హైదరాబాద్ ఐటీ రంగానికి అవసరమైన ఏదైనా పథకాన్ని ప్రకటించాలని కనీసం 50సార్లు కేంద్రాన్ని కోరినట్లు కేటీఆర్ వివరించారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ ఐటీ రంగానికి నయా పైసా కూడా సాయం చేయలేదని అన్నారు.
ఐటీఐఆర్ ఉండి ఉంటే... కేంద్రానికి హైదరాబాద్ ఐటీ పరిశ్రమ అభివృద్దిపై చిత్తశుద్ది లేకే ఐటీఐఆర్‌కు ప్రత్యామ్నాయం చూపలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలైన నోట్ల రద్దు, కరోనా లాక్ డౌన్, పాలసీ పారలసిస్‌లతో ఏర్పడ్డ ఆర్థిక, సామాజిక సంక్షోభంలోనూ దేశసగటును మించిన అద్భుతమైన ప్రగతిని తెలంగాణ ఐటీ పరిశ్రమ సాధించిందని కేటీఆర్ వివరించారు. ఒకవేళ ఐటీఐఆర్ ప్రాజెక్టు ఉండి ఉంటే గడచిన ఏడేళ్లలో హైదరాబాద్ ఐటీ ఎకో సిస్టం ఆకాశమే హద్దుగా అద్భుతంగా ఎదిగేదని అభిప్రాయపడ్డారు.
క్షమాపణ చెప్పాల్సిందే... ఎనిమిదేళ్లుగా తెలంగాణ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న మోదీ ప్రభుత్వం... రాజకీయంగా తమకు ప్రయోజనం కాదన్న ఏకైక కారణంతోనే ఐటీఐఆర్‌ను రద్దుచేసిందని ఆరోపించారు. ఆధునిక భారత్‌ను నిర్మించడంపై తమకున్న విధానపర అశక్తతను పార్లమెంట్‌లో ఒప్పుకుని తెలంగాణ ఐటీ గ్రాడ్యుయేట్లు, వృత్తినిపుణులు, యువతకు మోదీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఐటీఐఆర్ రద్దుతో ఎనిమిదేళ్ల కాలంలో తెలంగాణకు జరిగిన నష్టంపై వివరణ ఇవ్వాలని అన్నారు.