రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, ఈవీ రంగాల్లో విస్తృతంగా పెట్టుబడులు పెట్టాల్సిందిగా తైవాన్ ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుక అపారమైన అవకాశాలున్నాయని వారికి సూచించారు. రాష్ట్రంలో పర్యటిస్తున్న తైవాన్ ఎకనమిక్ కల్చరల్, ట్రేడ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ప్రతినిధులకు హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సాదరంగా స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య పెట్టుబడుల ప్రోత్సాహానికి రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇందుకు తైవాన్ బృందం సానుకూలంగా స్పందించింది. వారు ఆసక్తిని కనబరచటంతో పాటు త్వరలోనే తైవాన్ కంపెనీలతో ఓ వర్చువల్ పెట్టుబడి సదస్సు నిర్వహిస్తామని తైవాన్ డైరెక్టర్ జనరల్ వాంగ్ మంత్రి కేటీఆర్‌కు హామీ ఇచ్చారు.
ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు సిద్ధం
రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాలసీలు, ముఖ్యంగా టీఎస్ ఐపాస్ లాంటి ప్రభుత్వ విధానాలను టీఈసీసీ డైరెక్టర్ జనరల్ బెన్ వాంగ్‌కు మంత్రి కేటీఆర్ వివరించారు. ముఖ్యంగా తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇతర ప్రాధాన్య రంగాల్లో రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాల గురించి చెప్పారు. తైవాన్‌కు చెందిన ప్రముఖ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు తాను స్వయంగా తైవాన్‌లో పర్యటించి తెలంగాణలోని వ్యాపార అనుకూలతపై జరిపిన చర్చలను ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం - తైవాన్ పారిశ్రామిక వర్గాల పెట్టుబడులకు సంయుక్త భాగస్వామ్యంలో ప్రత్యేకంగా ఒక ఇండస్ట్రియల్ పార్క్‌ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. తైవాన్- తెలంగాణ మధ్య పెట్టుబడుల విషయంలో సహకరించాల్సిందిగా డైరెక్టర్ జనరల్ బెన్ వాంగ్‌ను మంత్రి కేటీఆర్ కోరారు.